బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పెళ్లి విషయంలో గత కొద్దికాలంగా షికార్లు చేస్తున్న పుకార్లకు తెరపడింది. సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా పెళ్లిని ఖరారు చేస్తూ అనిల్ కపూర్, అహుజా కుటుంబాలు మంగళవారం సంయుక్తంగా అధికారిక ప్రకటనను విడుదల చేశాయి. మే 8న ముంబైలో సోనమ్, ఆనంద్ వివాహం జరుగుతుందని వెల్లడించాయి. సోనమ్ కపూర్ నివాసంలో ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలయ్యాయని అంటున్నారు. కొన్ని రోజుల క్రితమే ఇంటిని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. మెహెందీ వేడుకను కూడా సోనమ్ పెద్దమ్మ కవితా సింగ్‌కు చెందిన విలాసవంతమైన భవంతిలో మే 7న నిర్వహించనున్నట్లు సమాచారం. ఏడువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విలాసవంతమైన అపార్ట్‌మెంట్ ధర రూ.35 కోట్లట. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని సన్‌టెక్ సిగ్నేచర్ ఐల్యాండ్‌లో ఈ భవంతి ఉంది. ఇక్కడే ఎంతో ఘనంగా మెహెందీ వేడుకను నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వేడుకకు కరణ్ జోహార్ దగ్గర నుంచి అర్జున్ కపూర్, జాన్వి కపూర్ సహా ప్రముఖలంతా హాజరవుతారట.సోనమ్, ఆనంద్ వివాహ విషయాన్ని ప్రకటిస్తుండటం కపూర్, అహుజా కుటుంబాలకు చాలా ఆనందంగానూ గర్వంగాను ఉంది. మే 8న ముంబైలో వీరి పెళ్లి జరుగుతుంది. ఇది సన్నిహితులకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి మా కుటుంబాల ఏకాంతానికి సహకరించాలని కోరుతున్నామన్నారు.