న్యూఢిల్లీ జూన్ 29
జమ్మూకశ్మీర్‌లో కూడా మతమార్పిడిని వ్యతిరేకిస్తూ చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కొందరు సిక్కు నేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డిని కలిశారు. కశ్మీర్‌లో సిక్కు అమ్మాయిలను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుంటున్న ఘటనల గురించి వారు మంత్రికి వివరించారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల సిక్కు మతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలను బలవంతంగా పెళ్లి చేసుకుని, మతమార్పిడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో అకాలీదళ్ నేతలు అక్కడ భారీ నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. గన్‌పాయింట్‌లో బెదిరించి తమ మతానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నట్లు సిక్కులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకుని, వారిని ఇస్లాం మతంలోకి మార్చి నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ఓ అమ్మాయి పరారీ అయి తన స్వంత ఇంటికి చేరుకున్నది. మరో అమ్మాయి పరిస్థితి ఇంకా తెలియలేదు. అకాలీదళ్ నేత మణ్‌జిందర్ సింగ్ సిస్రా ఆధ్వర్యంలో సిక్కులు నిరసనలు కూడా చేపట్టారు. బీజేపీ నేత ఆర్పీ సింగ్ ఆ బృందంలో ఉన్నారు.