న్యూఢిల్లీ, జూన్ 30,
ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. కానీ కేంద్రంలో ప్రతిపక్షంగా కాకుండా మిత్రపక్షంగానూ లేకుండా త్రిశంకు స్వర్గంలో ఉంది. మోడీ సర్కార్ కూడా అటు స్నేహం చేయకుండా ఇటు వైరం పెంచకుండా నెట్టుకువస్తోంది. మొత్తానికి ఇదొక అర్ధం కాని బంధం గా ఉంది. ఈ నేపధ్యంలో నేరుగా మోడీ సర్కార్ లో చేరాలని జగన్ కి పిలుపులు వస్తున్నాయట. దీని మీద వైసీపీ అధినాయకత్వానికి బంపర్ ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారుట.
కోరి మరీ పదవులు ఇస్తామంటే తీసుకొవడానికి ఏంటి అభ్యంతరం అని బీజేపీ పెద్దలు అడుగుతున్నారు. రెండేళ్ళుగా ఏపీలో కేంద్రం తరఫున ఒక్క మంత్రీ లేరు. దాని వల్ల జరగాల్సిన అభివృద్ధి ఆగింది అని కూడా నచ్చచెబుతున్నారుట. ఎన్నికల వరకే రాజకీయాలు, ఇపుడు అభివృద్ధి ముఖ్యమని కూడా సూచిస్తున్నారుట. మరి ఇవన్నీ జగన్ చెవిన బాగానే పడుతున్నాయట. మొత్తానికి కేంద్రం పదవులతో వైసీపీని పడగొడుతుంది అంటున్నారు.వైసీపీకి మూడు పదవులు ఖాయమని తెలుస్తోంది. త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగితే వైసీపీకి ఇచ్చే పదవుల సంఖ్య కూడా బీజేపీ పెద్దలు వైసీపీ అధినాయకత్వం చెవిన వేశారుట. అంటే వారు ఆఫర్ చేసినవి పదవులే మూడు అయితే వైసీపీ రాయబేరాలు సాగిస్తే ఇంకా ఒకటో రెండో పదవులు దక్కడం ఖాయమని అంటున్నారు. ఇప్పటిదాకా ఏపీకి సంబంధించి ఏ పెద్ద సాయం కేంద్రం చేయలేదు. ఇపుడు మంత్రివర్గంలోనే చేరమంటోంది. దాంతో నిధులు తామే సొంతంగా రాష్ట్రానికి తెచ్చుకునే వీలు ఉంటుంది కదా అని సీరియస్ గానే వైసీపీ అధినాయకత్వం పరిశీలిస్తోందిట.అనూహ్య పరిణామాల నేపధ్యంలో వైసీపీ కేంద్ర మంత్రి వర్గంలో చేరుతుంది అంటున్నారు. దాంతో ముగ్గురుకి కీలకమైన శాఖలతో కేంద్ర పదవులు దక్కుతాయని అంటున్నారు. వీటి నుంచి ఒకటి విజయసాయిరెడ్డికి ఇస్తారని, మిగిలిన రెండు పదవులను బీసీ, ఎస్సీలకు కేటాయిస్తారని అంటున్నారు. బీసీ ఎంపీలలో రాజమండ్రీ ఎంపీ మార్గాని భరత్ ముందంజలో ఉన్నారని అంటున్నారు. ఇక ఎస్సీ కోటాలో అయితే తిరుపతి నుంచి గెలిచిన డాక్టర్ ఆదిమూర్తికి ఇస్తారని కూడా చెబుతున్నారు. మొత్తానికి మూడు పదవులు మూడు ప్రాంతాలు, మూడు సామాజిక వర్గాలు అన్న లెక్కలు అయితే వైసీపీలో వేసుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.