శ్రీకాకుళం, జూన్ 30,
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మధ్యనే తిరుపతిలోని ఒక హొటల్ లో టీడీపీ లేదూ ఏమీ లేదు అన్నట్లుగా మాట్లాడారు. ఆ తరువాత ఆయన దూకుడు పెంచారు. అధినాయకత్వం మెప్పు పొందడానికి అన్నట్లుగా అచ్చెన్నాయుడు మాటలు యమ జోరు చేస్తున్నాయి. ఆరు నూరు అయినా వచ్చేది మా ప్రభుత్వమే. అపుడు ఇంతకు ఇంతా వైసీపీకి వడ్డీలు చెల్లిస్తామని, అసలు బాకీలు కూడా తీర్చేస్తామని అచ్చెన్నాయుడు గట్టిగానే గర్జిస్తున్నారు. ఆ మధ్యన అచ్చెన్నాయుడుని శ్రీకాకుళంలో పోలీసులు అరెస్ట్ చేసినపుడు ఆయన తాను హోం మంత్రిని అవుతాను అని కూడా శపధం చేశారు.
టీడీపీ పోలీసుల మీదనే దృష్టి పెడుతోంది. నిజానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే పోలీసులు అటు వైపునే ఉంటారు. ఒక ప్రభుత్వం తన అధికార దర్పం చూపించాలి అంటే పోలీసులను రంగంలోకి దింపితేనే అది సాధ్యపడుతుంది. టీడీపీ విషయానికి వస్తే వారు ఏలుబడిలో కూడా పోలీసులు ఇంతకు మించి సర్కార్ కి అనుకూలంగా పనిచేశారు అని వైసీపీ నేతలు విమర్శించేవారు. జగనే విశాఖ ఎయిర్ పోర్టులో తన మీద తానుగా హత్యాయత్నం చేసుకున్నారని నాటి డీజీపీ వ్యాఖ్యానించిన సంగతి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అలాంటిది ఇపుడు పోలీసులకు అచ్చెన్నాయుడు వంటి నేతలు హెచ్చరికలు పంపుతోంది.అచ్చెన్నాయుడుకు పోలీసు మంత్రిగా పనిచేయాలని ఉందని ఎపుడో చెప్పేశారు. మరి ఆయనకు ఆ పదవి దక్కాలి అంటే టీడీపీ తిరిగి పవర్ లోకి రావాలి. ఇపుడున్న పరిస్థితులలో టీడీపీకి మళ్ళీ పునరుజ్జీవనం ఉందా అంటే సందేహమే అంటున్నారు. పైగా ఎక్కడ చూసినా క్యాడర్ అసలు ఉలుకూ పలుకూ లేకుండా ఉంది. అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యాక తన సొంత జిల్లాలోనే పార్టీని గెలిపించుకోలేకపోయారు. మరో వైపు పేరుకే అచ్చెన్న ప్రెసిడెంట్, అసలు హవా అంతా లోకేష్ దే అని ఏకంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు గాలి తీసేశారు. ఇపుడే ఇలా ఉంటే రేపు అధికారంలోకి వచ్చినా అచ్చెన్నాయుడుకు అంతటి కీలకమైన శాఖ ఇస్తారా. ఆయన ముచ్చట తీరేనా అన్నదే చర్చ.ఇంకో వైపు చూస్తే చంద్రబాబు తో అచ్చెన్నాయుడుకి గ్యాప్ వచ్చేసింది అంటున్నారు. తిరుపతి లో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తరువాత చంద్రబాబు ఆయన విషయంలో పెద్దగా పట్టనట్లుగా ఉంటున్నారు అని పార్టీ వర్గాల సమాచారం. అచ్చెన్న ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయితే రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా కూడా పరామర్శకు లోకేష్ బాబు పై నుంచి దిగిపోతున్నారు. ఆఖరుకు పక్కనున్న విశాఖలో మత్తు డాక్టర్ కుటుంబాన్ని పరామర్శ చేసే చాన్స్ కూడా అచ్చెన్నాయుడుకు దక్కలేదు అన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి. పార్టీలో ఇపుడున్న పొజిషన్ ఇలా ఉంటే ఎట్టా హోం మంత్రి అవుతావు అచ్చెన్నా, కలలు కంటున్నావా అంటోంది వైసీపీ. అచ్చెన్నకే కాదు, లోకేష్ చంద్రబాబు కలలు కూడా 2024లో అసలు నెరవేరవని వైసీపీ నేతలు ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే అచ్చెన్నాయుడు హోం మంత్రి ఈ రెండింటికీ లింక్ కుదిరేనా. అన్నదే ఆయన అనుచరుల వేదన.