YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కెప్టెన్ కు రాహుల్ ఓటు

కెప్టెన్ కు రాహుల్ ఓటు

న్యూఢిల్లీ, జూన్ 30, 
పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీలో తలెత్తిన విభేదాలను పరిష్కరించే క్రమంలో అధిష్టానం కొన్నిరోజులుగా నేతలతో ఢిల్లీలో మంతనాలు జరుపుతోంది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ, పలువురు పంజాబ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, రాహుల్‌ తాజా వ్యాఖ్యలతో.. పార్టీ చీలికకు ముఖ్యకారణంగా భావిస్తున్న నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధుకు గట్టి షాక్‌ తగిలినట్లయింది. తాను ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలుస్తానని సిద్ధు చెప్పగా అలాంటిదేమీ ఉండబోదని.. రాహుల్‌ కుండబద్దలుకొట్టారు. జన్‌పథ్‌ 10లోని తన నివాసం నుంచి తన తల్లి, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటికి పయనమైన రాహుల్‌ గాంధీ ఏఎన్‌ఐతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘సిద్ధుతో సమావేశం ఉండదు’’ అని స్పష్టం చేశారు. ఇక  పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్, అసంతృప్త నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సంక్షోభాన్ని రూపుమాపేందుకు ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. కాగా ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలైన అర్జున్‌ ప్రతాప్‌సింగ్‌ బజ్వా, భీష్మ పాండే కుమారులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం అమరీందర్‌ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో పరస్పర విమర్శలతో సీఎం, సిద్ధు వర్గం దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే, పంజాబ్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ హరీష్‌ రావత్, సీనియర్‌ నేత జేపీ అగర్వాల్‌లతో కూడిన ఈ కమిటీ రంగంలోకి దిగింది. ఈ ప్యానెల్‌ ఎదుట హాజరైన సీఎం అమరీందర్‌ సింగ్‌ గట్టిగానే తన వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సిద్ధుతో మీటింగ్‌ ఉండబోదంటూ రాహుల్‌ వ్యాఖ్యానించడం ఆయన వర్గానికి మింగుడుపడటం లేదు.

Related Posts