న్యూఢిల్లీ, జూన్ 30,
వ్యాక్సిన్ ఏదో ఒకటే వేసుకోవాలా? రెండు వేర్వేరు టీకాలు తీసుకోవచ్చా? అన్న దానిపై చాలా రోజులుగా అందరికీ అనుమానాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఫస్ట్ డోస్ కొవిషీల్డ్, రెండో డోసు కొవాగ్జిన్ తీసుకున్న ఘటనలు కూడా జరిగాయి. తాజాగా యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో రెండు వేర్వేరు టీకాలను తీసుకున్నా సమస్య లేదని తేలింది. పైగా కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుందని సైంటిస్టులు గుర్తించారు. అయితే వారు స్టడీ చేసిన టీకాల్లో కొవాగ్జిన్ లేదు. యూకేలో ఫైజర్, కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్లలో ఒకటి మొదటి డోసు, మరొకటి రెండు డోసు తీసుకుంటే యాంటీబాడీల ఉత్పత్తి ఎలా ఉందన్న దానిపై అధ్యయనం చేశారు. దానికి సంబంధించిన ఫలితాలను లాన్సెట్ మెడికల్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. ఫైజర్ లేదా కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకుని, ఈ రెండింటిలో మరో వ్యాక్సిన్ ను రెండో డోసుగా తీసుకోవడం ద్వారా, రెండు డోసులు ఒకే వ్యాక్సిన్ తీసుకున్న దానితో పోలిస్తే మరిన్ని యాంటీబాడీలు జనరేట్ అవుతాయని ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్, లీడ్ సైంటిస్ట్ మాథ్యు స్నేప్ తెలిపారు. యూకేలో కొంత మంది వలంటీర్లకు వేర్వేరు టీకాలు వేస్తామని ఆప్షన్ ఇచ్చామని, 830 స్వచ్ఛందంగా ముందుకు రాగా, వారిపై ఈ ట్రయల్ నిర్వహించినట్లు చెప్పారు. ఫైజర్ టీకానే రెండు డోసులు తీసుకున్న వారి కంటే ఒకటి కొవిషీల్డ్, మరొకటి ఫైజర్ డోసుకున్న వారిలో వైరస్ తో ఫైట్ చేసే టీ-సెల్స్ ప్రతిస్పందన తీరు చాలా మెరుగ్గా ఉందని తమ స్టడీలో గుర్తించామన్నారు. ప్రస్తుతం అనేక దేశాల్లో వ్యాక్సిన్ కొరత ఉన్న నేపథ్యంలో ఈ సమస్యను తీర్చేందుకు ఇలా మిక్స్డ్ డోసుల విధానం ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ స్నేప్ అన్నారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాల మాదిరిగానే మరికొన్ని వ్యాక్సిన్లను కలిపి వేయడంపైనా ట్రయల్స్ చేస్తామని తెలిపారు.కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనికా) వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ ను మరింత పెంచడం ద్వారా ఈ టీకా పని తీరు చాలా మెరుగుపడుతుందని ఆక్స్ ఫర్డ్ స్టడీలో తేలింది. మొదటి రెండు డోసులకు మధ్య గ్యాప్ ను ఇప్పటికే ఆరు వారాల నుంచి 12 వారాలకు పెంచవచ్చని గతంలో అధ్యయనాల్లో చెప్పిన సైంటిస్టులు తాజాగా ఈ గ్యాప్ ను 45 వారాల వరకూ పెంచితే మరింత బెటర్ ఇమ్యూనిటీ రెస్పాన్స్ వస్తుందని చెప్తున్నారు. దీని ద్వారా యాంటీబాడీలు ఎక్కువ ఉత్పత్తి అయ్యి, కరోనా వైరస్ ను ఎదుర్కొనే శక్తి టీ-సెల్స్ లో పెరుగుతుందని ప్రొఫెసర్ స్నేప్ వివరించారు. ఇక బూస్టర్ డోస్ కూడా తీసుకోవచ్చని, రెండో డోసు తీసుకున్నాక 6 నెలల తర్వాత మూడో డోసు కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకుంటే రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు.