YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

వరూధిని ఏకాదశి

వరూధిని ఏకాదశి

దానాలలో విశిష్టమైనది అశ్వదానం. అశ్వదానం కంటె కూడా గజదానం; గజదానం కంటే భూమిదానం;  భూమిదానం కంటే కూడా నువ్వులు దానం; నువ్వులు దానం కంటే సువర్ణ దానం;  స్వర్ణ దానం  విశిష్టమైనవి.  వీటన్నిటికంటే ఉన్నతమైనది  అన్నదానం. పితృలకు, దేవతలకు, మానవులకు  సంతృప్తినిచ్చేది అన్నదానం మాత్రమే. ఇతరదానాలలో చాలు అనే తృప్తి కలుగదు. కాని అన్నదానంలో ఇంక చాలు చాలు అనే తృప్తిని యిస్తుంది.  ఆకలితో  అలమటించే ప్రాణికి  బంగారాన్ని, గుఱ్ఱాలను,ఏనుగులను దానం చేసినందువలన  ఏ ఉపయోగం లేదు. కాని వెంటనే గుప్పెడన్నం  పెడితే వారి  ప్రాణాలు కాపాడబడతాయి.  అందుకే  దానాలన్నిటిలో అన్నదానమే ఉన్నతమైనదిగా చెప్పారు. అటువంటి అన్నదానంతో సమానమైన పుణ్యఫలాలను యివ్వగల వ్రతం ఏదైనా వున్నదా ?అని పరిశీలించినప్పుడు " వరూధిని ఏకాదశివ్రతం" గురించి మన పురాణాలు తెలిపాయి. ఒక మనిషి  సంసార సాగరాన్ని ఈదడానికి   ఏకాదశి వ్రతం ఒక తెప్పలాటి ఉత్కృష్ట సాధనం అని శాస్త్రాలు తెలుపుతున్నాయి. అలాటి వాటిలో వరూధిని ఏకాదశి వ్రతం కురుక్షేత్ర పుణ్య భూమిలో సూర్యగ్రహణం రోజున స్వర్ణదానం చేయడానికి సమానమైనదిగా ధర్మగ్రంధాలు వివరిస్తున్నాయి. ఇలా అనడానికి  ఒక కారణం వున్నది.  కురుక్షేత్ర పుణ్యభూమిలో సూర్యగ్రహణం  రోజున సువర్ణ దానం చేయడం అనేది అంత సులభమైన కార్యం కాదు. ముందుగా, మనం కురుక్షేత్ర పుణ్యభూమిలో వుండాలి. ఆ రోజు సూర్యగ్రహణం అయివుండాలి. అప్పుడు సువర్ణ దానం చేయాలి. ఒక దానంలోని మూడు విశిష్టతలు యిందులో చెప్పబడ్డాయి. ఏ ప్రదేశంలో చేస్తున్నాము,  ఏ పుణ్యదినాన చేస్తున్నాము, ఏవి దానం చేస్తున్నాము అనే విషయాలు పరోక్షంగా చెప్పబడ్డాయి. మన చేసే కర్మలను బట్టే కలిగే పాప పుణ్యాలే  మనిషి జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి.  ఒకరి జీవితంలో జరిగే అన్ని మంచి, చెడ్డలకు కారణం వారి కర్మ ఫలాలు.  జీవితంలో సుఖమే లేక కష్టాలు పడుతున్నవారికి వాటినుండి విముక్తి పొందడంకోసం  కొన్ని వ్రతాలను విధివిధానంగా  ఆచరించి పరిహారం చేసుకునేందుకు మాస, నక్షత్ర, తిధి, వారములను ఏర్పరిచారు.  ఇటువంటి  ఉత్తమ వ్రతాలలో ఒకటి ఏకాదశి వ్రతం. అమావాస్య లేక పౌర్ణమి నుండి 11 వ రోజు. ఆ రోజున మన దేహానికి  విశ్రాంతిని యిచ్చి, మనసుకి ఉత్సాహాన్ని నవ చైతన్యాన్ని కలిగించే ఉన్నతమైన రోజే ఏకాదశి దినం. ఆనాడు సంపూర్ణ ఉపవాసముండి భగవధ్యానంలో వుంటే మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది.  చింతనాశక్తి పెరుగుతుంది. చేపట్టే కార్యాలలో విజయం లభిస్తుంది. చేసిన పాపాలు నశిస్తాయి. మనలను భగవంతునికి దగ్గర చేస్తుంది. వైశాఖ మాసం బహుళ పక్షం లో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి వ్రతంగా ఆచరిస్తారు. స్త్రీలు యీ వ్రతాన్ని విధివిధానంగా ఆచరించి మహావిష్ణువుని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఈ వ్రత మహిమ గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేశాడు. ఈ వ్రతాన్ని భక్తి శ్రధ్ధలతో ఆచరించినవారికి వారి జీవితకాలంలో  ఆ తరువాత కూడా వున్న పాపాలు తొలగి సుఖంగా జీవించి  సద్గతులు పొందుతారు. వారి సంతానం సుఖంగా జీవిస్తారు. చివరికి  జనన మరణ చక్రాలనుండి విడుదలపొంది నా చరణాల వద్దకి  చేరుకుంటారు అని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. ఈ  ఏకాదశి వ్రతాన్ని  ఆచరించిన మాంధాత అనే రాజు ముక్తి పొందాడు.  శ్రీరాముడు జన్మించిన ఇక్ష్వాకు  వంశంలోనే జన్మించిన దుందుమారుడు అనే రాజు  పరమశివుని శాపానికి గురికాగా తన తప్పుకు పరిహారంగా యీ  వరూధిని ఏకాదశి వ్రతం ఆచరించి తన శాపాన్ని తొలగించుకున్నాడు. అని కూడా శ్రీ కృష్ణుడు చెప్పాడు. ఏకాదశినాడు ఉపవాసం వుండడం ఉత్తమం.  అలాచేయలేని వారు అన్న పదార్ధాలు తినకుండా  ఫలహారం తీసుకోవచ్చు. ఆ రోజంతా విష్ణు సహస్రనామ పారాయణంతో గడపాలి.  ఈ ఏకాదశినాడు  చేయకూడని పనులు... 

1.కంచు పాత్రలో భుజించకూడదు.

2. మాంసం ముట్టకూడదు.

3.జూదమాడకూడదు.

4.నిద్రపోరాదు .

5.తాంబూలం వేసుకోకూడదు

6.ఇతరులను తక్కువ చేసి మాటాడరాదు.

7.కోపం తెచ్చుకుని ఇతరులను తిట్టకూడదు.

8.అసత్యం పలుకరాదు.

అలాగే ఏకాదశి నాడు కొన్ని పనులు చేయడం శాస్త్ర విరుధ్ధం.

 ఆరోజున శిరోజాలు కత్తిరించుకోవడం;

ముఖ క్షవరం చేసుకోడం;

ఒంటికి నూనె రాసుకోవడం చేయకూడదు.

ఈ ఏకాదశి వ్రత మహాత్యాన్ని చదివినా,  ఎవరైనా చదివినప్పుడు విన్నా  వేయిగోవులు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. 

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts