YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మితిమీరుతున్న నీటి మంటలు

మితిమీరుతున్న  నీటి మంటలు

హైదరాబాద్, జూలై 1,
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తారాస్థాయికి చేరుకుంది. కృష్ణాజలాల వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై ఒకరిపై ఒకరు మాటలదాడి పెంచేశారు. రెండు రాష్ట్రాల్లో మంత్రులు నీళ్లపై మాటల యుద్ధం పెంచారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చెయ్యగా.. తెలంగాణ నుంచి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు.శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్ కోసమని, జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమనే హక్కు ఎవరికి లేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టంచేశారు. ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ జలవిద్యుదుత్పత్తిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా, అహంకార దోరణితో వ్యవహరిస్తోందని, మా ఇష్టమోచ్చినట్లు మేము చేస్తాం.. మేము చెప్పినట్లు మీరు చేయాలి అన్నట్లుగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందన్నారు.శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నంత సేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని, అలా చేయకుండా తెలంగాణను ఆపే శక్తి ఎవరికి లేదన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, జూరాల‌లో విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ హక్కు అని, ఎవరో ఆర్డర్ వేస్తే వినాల్సిన అవసరం మాకు లేదన్నారు. కృష్ణా నీటిలో మా వాటాలో ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని, ఆంధ్రప్రదేశ్ దొంగదారిలో, అక్రమ పద్దతిలో నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.పాతరోజులు ఇక లేవని.. తెలంగాణ ఇప్పుడు స్వరాష్ట్రంగా ఏర్పడిందని, ఎవరి చెప్పుచేతుల్లోనూ తెలంగాణ ప్రజలు లేరని, మీ బానిసలు అధికారంలో లేరని జగదీష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు విషయంలో ముందు మీ అక్రమ నిర్మాణాలు మానేసి ముందుకు రావాలని మంత్రి సూచించారు.అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాలకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాషను వాడుతున్నారు. వైఎస్‌ను అవమానించేలా తెలంగాణ మంత్రులు మాట్లాడటం సరికాదు. సాగునీటి అవసరాల తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి ఉండాలని, తక్కువ సమయంలో నీళ్లు తీసుకోవాలంటే సామర్థ్యం పెంచక తప్పదని, అవసరమైతే ఎంతదూరమైనా వెళ్తాం.”అన్నారు.
ఎవరినైనా ఎదురిస్తా : షర్మిల
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. ఈ వ్యవహారంలో ఆమె మరోసారి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తాము పోరాడతామని చెప్పారు. రాష్ట్రం కోసం, నీటి కోసం ఎవరినైనా ఎదిరించేందుకు నేను సిద్ధమే అని షర్మిల అన్నారు. అంతేకాదు తెలంగాణకు ఒక్క నీటి చుక్క అన్యాయం జరిగినా సహించబోమని హెచ్చరించారు.తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నీటి కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. తెలంగాణ మంత్రులు ఏపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ మంత్రులు సైతం అంతే ధీటుగా స్పందిస్తున్నారు. ఎదురు దాడికి దిగారు. నీటి విషయం ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు మద్దతుగా షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. పొలిటికల్ హీట్ ని మరింత పెంచాయి.తెలంగాణలో రాజన్న రాజ్య స్థాపనే లక్ష్యంగా పార్టీని స్థాపించబోతున్నట్టు షర్మిల తెలిపారు. అందరికీ ఉచితంగా విద్య, వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తమ పార్టీ కులాలకు, మతాలకు అతీతంగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం నిలబడటానికి నాలుగు స్తంభాలు చాలా ముఖ్యమని… అవి కూడా చేయలేనిది చేసేదే ఫిఫ్త్ ఎస్టేట్ అని… అదే సోషల్ మీడియా అని చెప్పారు. నెటిజన్ల మద్దతు లేకుండా తాను ఏమీ చేయలేనని అన్నారు.

Related Posts