మహబూబ్‌నగర్ జూలై 1
తాము ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకే వ్యతిరేకం కాని ఆంధ్రా ప్రజలకు కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఏపీ నాయకులు.. ఈ వివాదంలోకి ప్రజలను లాగడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.మహబూబ్‌నగర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు ఉన్నారని, ఏపీ సీఎం జగన్, మంత్రులు మాట్లాడటం బాధాకరమన్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాను ఎడారిని చేసేందుకు ఏపీ సీఎం ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌ను కాదని పెన్నా నదికి నీటిని తరలించడం మంచిది కాదు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు.. ఈ విషయం కృష్ణా బోర్డుకు తెలియదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ సహించరు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తెలంగాణ మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే.