న్యూఢిల్లీ జూలై 1
ఇండియాలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ). ఇది తొలిసారి అమలై నాలుగేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. పన్నుల వ్యవస్థ స్థిరత్వానికి చేసిన ఈ ప్రయత్నంలో చాలా వరకూ సవాళ్లను అధిగమించినట్లు ఆమె చెప్పారు. జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ ట్యాక్స్ బేస్ రెట్టింపైనట్లు తెలిపారు. అంతకుముందు 66.25 లక్షలుగా ఉన్న ట్యాక్స్ బేస్ ఇప్పుడు 1.28 కోట్లకు చేరినట్లు నిర్మల వెల్ డించారు.తాజాగా వరుసగా ఎనిమిదో నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం గమనార్హం. ఏప్రిల్‌లో అయితే అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీని అమలు చేయడంలో సహకరించిన దేశ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఈ కొత్త పన్ను విధానం వల్ల ఏకీకృత మార్కెట్, పన్ను మీద పన్ను విధానం తొలగింపు, వస్తుసేవల్లో పెరిగిన పోటీతత్వం వల్ల ఆర్థిక వృద్ధి వేగం పెరిగిందని ఆమె వెల్లడించారు.