బీజింగ్ జూలై 1
డ్రాగన్ దేశంలో కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విదేశీ శక్తులు తమను బెదిరించే ప్రయత్నం చేసినా లేక అనుచితంగా ప్రవర్తించినా.. వారి తలలు పగులుతాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. బెదిరింపులకు భయపడే రోజులు పోయాయన్నారు. తయిమిన్ స్క్వేర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పవిత్ర సందేశాలు పనిచేయవన్నారు. అమెరికాను టార్గెట్ చేస్తున్న రీతిలో చైనా అధ్యక్షుడు కఠినంగా ప్రసంగించారు. చైనా పట్టుదలను ఎవరూ తక్కువగా అంచనా వేయరాదు అని, దేశ సార్వభౌమత్వాన్ని, జాతి సమగ్రతను కాపాడుకునేందుకు చైనా ప్రజలు వెనుకడుగు వేయరన్నారు. తైవాన్ ఏకీకరణ విషయంలో తమల్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల సంబరాల నేపథ్యంలో బీజింగ్ కళకళలాడింది. మిలిటరీ విమానాలతో ఫ్లై పాస్ట్ నిర్వహించారు. శతఘ్నలను పేలుస్తూ సెట్యూల్ నిర్వహించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. తయిమిన్ స్క్వేర్‌లో జరిగిన వేడుకలకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మాస్క్‌లు లేకుండానే జనం కనిపించారు. దాదాపు గంట సేపు జీ జిన్‌పింగ్ ప్రసంగించారు. దేశాన్ని ఆధునీకరించడంలో తమ పార్టీ సాధించిన ఘనతను ఆయన వెల్లడించారు. దేశాభివృద్ధిలో పార్టీ కీలకంగా నిలిచిందన్నారు.