న్యూఢిల్లీ జూలై 1
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఆరేళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంతో టెక్నాలజీ అనుకరణలో దేశంలో చాలా వేగంగా ముందుకు వెళ్లిందన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా అనేక రాష్ట్రాలు పలు స్కీమ్‌లను నిర్వహిస్తున్నాయి. ఆ స్కీమ్‌ల లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. యూపీలోని దీక్షా స్కీమ్ లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ.. ఆవిష్కరణ కోసం ఆసక్తి ఉంటే.. టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకోవచ్చు అని తెలిపారు. 21వ శతాబ్ధపు భారత నినాదం డిజిటిల్ ఇండియా అని ఆయన అన్నారు.కోవిడ్ వేళ డిజిటిల్ ఇండియా ఎంత సమర్థవంతంగా పనిచేసిందో చూశామన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు విఫలమైన వేళ.. మనం నేరుగా ఖాతాల్లోకి అమౌంట్‌ను బదిలీ చేశామన్నారు. ఆ అమౌంట్ సుమారు 7 లక్షల కోట్లు ఉంటుందన్నారు. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా మౌళిక సదుపాయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టినట్లు ప్రధాని తెలిపారు. అనేక ప్రపంచదేశాలు కోవిన్ పోర్టల్ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిపారు. కోవిన్ ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ .. మన టెక్నాలజీ సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఆన్‌లైన్ విద్య, వైద్య కోసం డెవలప్ చేసిన ఫ్లాట్‌ఫామ్స్ కోట్లాది మంది భారతీయులకు ఉపయోగపడినట్లు ఆయన చెప్పారు. డిజిలాకర్ ద్వారా డిజిటిల్ ఇండియా సామర్థ్యం తెలుస్తుందన్నారు. స్కూల్, కాలేజీ డాక్యుమెంట్లు, ఆధార్, ప్యాన్, ఓటర్ కార్డులను డిజీలాకర్‌లో ఈజీగా దాచుకోవచ్చు అన్నారు. డిజిటల్ ఇండియా వల్లే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలు సాధ్యమైందన్నారు.