విజయవాడ, జూలై 1,
పేదలు, మధ్యతరగతి ప్రజలు ఒక్కసారి పన్ను కట్టకపోతేనే అధికారులు జులుం ప్రదర్శిస్తుంటారు. ఇకవేళ పన్ను ఆలస్యంగా కడితే జరిమానా, దానికి వడ్డీ అంటూ హడావుడి చేస్తుంటారు. పన్ను కట్టకపోతే డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు నిలిపివేస్తుంటారు. అయితే ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ మాత్రం రెండేళ్లుగా ప్రభుత్వానికి పన్ను కట్టడం లేదన్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు నివసిస్తున్న ఇల్లు, పార్టీ కార్యాలయానికి సంబంధించి ఆయన ఏకంగా రూ.16.67లక్షల పన్ను బకాయి పడ్డారు. పన్ను బకాయిలకు సంబంధించి తాడేపల్లి మున్సిపాలిటీ అధికారులు వెబ్‌సైట్లో వివరాలు నమోదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే తాడేపల్లిలో భవనం నిర్మించుకున్నారు. అందులో రెండు బ్లాకులున్నాయి. 1750 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పార్టీ ఆఫీసు, 219 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించారు. ఈ రెండు భవనాలు జగన్ భార్య భారతి పేరు మీద ఉన్నాయి. ఏటా ఆఫీసుకు రూ.4,41,980, ఇంటికి రూ.19,752ల పన్ను తాడేపల్లి మున్సిపాలిటీకి కట్టాల్సి ఉంది.అయితే జగన్ సీఎం అయినప్పటి నుంచి ఆ భవనాలపై ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. దీంతో పార్టీ ఆఫీసుపై రూ.13,25,950, ఇంటిపై రూ.59,256 బాకీ పడ్డారు. అంటే మున్సిపల్ శాఖకు వైఎస్ భారతి రూ.13,85,196లు చెల్సించాల్సి ఉంది. జరిమానాలు కలుపుకుని రూ.16,67,299 బకాయి పడ్డారు. ఈ విషయం మున్సిపల్ అధికారుల తమ వెబ్‌సైట్లో పొందుపరిచారు.ముఖ్యమంత్రి అయిన జగన్ ప్రభుత్వ భవనంలో ఉంటే ఆస్తి పన్నుతో పాటు ఇతర ఛార్జీలన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుంది. ఒకవేళ ప్రైవేటు నివాసాల్లో ఉంటే, సంబంధిత భవన యజమానే స్థానిక పన్నులు భరించాలని అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధన ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు, ఇల్లు కొలువుదీరిన భవనాలకు వైఎస్ భారతీ రెడ్డి పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ విషయం బయటికి రావడంతో సోషల్‌మీడియాలో నెటిజన్లు జగన్‌ను ఏకిపారేస్తున్నారు. పన్నులు సామాన్యులకేనా? మీరు కట్టరా జగనన్నా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.