న్యూ ఢిల్లీ జూలై 1
ఇకపై ఎంచక్కా కారులో ఎగిరిపోవచ్చు. విమానం మాదిరిగా గాలిలో ఎగిరే కారుపై జరుగుతున్న ప్రయోగాలు ఫలిస్తున్నాయి. ఫ్లయింగ్ కారు తొలిసారి రెండు నగరాల మధ్య ప్రయాణించి మరో కీలక మైలురాయిని చేరుకున్నది. కారు, ఎయిర్‌క్రాఫ్ట్ మాదిరిగా డ్యూయల్ మోడ్‌లో ఉన్న ఈ వాహనం స్లోవేకియాలోని నైత్రా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నుంచి రాజధాని బ్రాటిస్లావా అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు గాలిలో ప్రయాణించి 35 నిమిషాల్లో చేరుకున్నది. దీంతో 2 గంటల ప్రయాణ సమయం ఆదా అయ్యింది. ల్యాండ్ అయిన వెంటనే విమానం మాదిరిగా ఉన్న ఇది ఒక బటన్ ప్రెస్‌తో మూడు నిమిషాల్లో స్పోర్ట్స్ కారు మాదిరిగా మారిపోయింది. ఈ ఫ్లయింగ్ కారును రూపొందించిన ప్రొఫెసర్ స్టీఫన్ క్లీన్, సహ వ్యవస్థాపకుడు అంటోన్ జాజాక్ డౌన్టౌన్ బ్రాటిస్లావాకు అందులో వెళ్లారు.గాలిలో ఎగిరే కారు (ఎయిర్ కార్) ప్రోటోటైప్ 1లో 160 హార్స్‌పవర్ బీఎమ్‌డబ్ల్యూ ఇంజన్, ఫిక్స్‌డ్ ప్రొఫెల్లర్, బాలిస్టిక్ పారాచూట్ ఉంటాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ పర్యవేక్షణలో ఈ ఎయిర్ కార్ 40 గంటల టెస్ట్ ఫ్లైట్స్‌ను పూర్తి చేసింది. నిటారుగా 45 డిగ్రీల మలుపులు తిరుగడం, తిరిగి స్థిరత్వం సాధించడం వంటి పరీక్షల్లోనూ ఇది రాణించింది. ఎయిర్ కార్ ప్రోటోటైప్ 1 గరిష్ఠంగా 8200 అడుగుల ఎత్తులో ఎగురగలదు. పరీక్షలో 190 కిలోమీటర్ల గరిష్ఠ క్రూజింగ్ వేగానికి ఇది చేరుకుంది.రహదారిపై నడిచే వాహనం నుంచి ఎగిరే వాహనంగాను తిరిగి అటు నుంచి ఇటుగా మార్పు చెండడం, రెక్కలు, తోక తెరుచుకోవడం, మూసుకోవడం వంటివి వినూత్న ఆవిష్కరణ, ఉత్సాహం, ధైర్యం ఫలితం మాత్రమే కాదని బోయింగ్ కంపెనీ సీనియర్ టెక్నికల్ డాక్టర్ బ్రాంకో సర్హ్ తెలిపారు. అద్భుతమైన ఇంజనీరింగ్, వృత్తిపరమైన జ్ఞానం ఫలితం వల్ల ఈ ఎగిరే కారు సాధ్యమైందని చెప్పారు.కాగా, ప్రీ-ప్రొడక్షన్ మోడల్ అయిన ఎయిర్ కార్ ప్రోటోటైప్ 2లో 300 హార్స్‌పవర్ ఇంజన్‌ను అమర్చనున్నారు. ఎం1 రోడ్ పర్మిట్‌తో EASA CS-23 విమాన ధృవీకరణ పత్రాన్ని కూడా పొందనున్నది. దాని వేరియబుల్ పిచ్ ప్రొపెల్లర్‌తో ఎయిర్ కార్ ప్రోటోటైప్ 2 క్రూయిజ్ వేగం గంటకు 300 కిలోమీటర్లు ఉంటుందని, 1000 కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు.