విజయనగరం, జూలై 2,
మాన్సస్ ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి ఇటీవల కోర్టు ఉత్తర్వులతో సంచయితా గజపతిరాజు వైదొలగి, మళ్లీ పూసపాటి అశోక గజపతిరాజు పున: నియామకం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానం భూముల్లో గతంలో జరిగిన అక్రమాలను, అశోక గజపతిరాజు ట్రస్టు ఛైర్మన్‌గా గతంలో చేసిన పనులను వెలికితీసే పనిని తాజాగా ముమ్మరం చేసింది. దీంతో వివాదం మరలా 'రాజు'కుంటోంది.సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి సుమారు 748 ఎకరాల భూమిని నిబంధనలు పాటించకుండా కబ్జా చేసే వ్యవహారంపై పూర్తిస్థాయిలో ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల జాయింట్ కలెక్టర్లే నేరుగా సర్వే చేసేలాగ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 29న ఆదేశించింది. విజయనగరం జిల్లా కొత్తవలస, విశాఖలోని భీమునిపట్నం ప్రాంతంలో ఈ అన్యాక్రంతం అయిన భూముల్లో ప్రాథమికంగా 36 ఎకరాలు గుర్తించినట్లు తెలుస్తోంది.. ఈ మొత్తం 748 ఎకరాలపై కోర్టుకు సమర్పించిన ఆధారాలన్నిటితో పాటు అశోక్‌గజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్న కాలంలో జరిగిన మరిన్ని అక్రమాలు బయటకొస్తాయంటూ వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జేసి కిశోర్‌బాబు, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి ఈ విచారణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. వీరు ఇచ్చే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు, ఈ భూ అవకతవకలకు పాల్పడిన పెద్దల పాత్రను బహిర్గతం చేస్తామంటూ విశాఖలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సంయుక్తంగా ఉద్ఘాటించారు. ఇదెవరిపైనా కక్ష సాధింపు కాదని, అది ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. తర్వాత పంచ గ్రామాల భూ సమస్యకు సైతం సులభంగా పరిష్కారం లభిస్తుందని, సింహాచలం పంచ గ్రామాలకు చెందిన భూ సమస్యపై వివాదం కోర్టులో పెండింగులో ఉందని, ఈ కేసును అడ్వకేట్ జనరల్ (ఎజి) హైకోర్టు ధర్మాసనానికి నివేదించినట్లు విజయసాయిరెడ్డి తాజాగా స్పష్టం చేశారు. అంతేగాక సింహాచలం దేవస్థాన భూముల్లో నివాసాలుంటున్న సుమారు 12 వేల మందికి రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందన్నారు. గతంలో అశోక్‌గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా దీన్ని జరగకుండా, చంద్రబాబు పాలనలో వీరిద్దరూ అడ్డుకున్నారన్నారు. కోర్టు ఉత్తర్వులు జులై (2021)లో రానున్నాయి. దీంతో పంచ గ్రామాల్లో నివాసం ఉండే వారి భూ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఎస్టేట్ ఎబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చిననాటి నుంచి ఇప్పటివరకూ మాన్సాస్ ట్రస్ట్‌లో జరిగిన అవకతవకలన్నిటినీ బయటకు లాగుతామన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ నేతల్లో... ముఖ్యంగా విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్‌గజపతిరాజు కూడా స్పందిస్తూ... అంతా సక్రమంగానే ట్రస్టు నడిచిందంటూ తాజాగా వెల్లడించారు. 1997 సంవత్సరంలో సింహాచలం దేవస్థానం భూములకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పట్టాల జారీలో జరిగిన అక్రమాలపైనా తాజాగా ప్రభుత్వం కోర్టులో కేసు వేసినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలూ బయటకొస్తే టిడిపికి చెందిన పలువురి నేతలపై చర్యలుంటాయంటూ వైసిపి నేతలు చెబుతున్నారు
సింహాచలం భూముల అక్రమాలపై ఈనెల 29న రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభిస్తూ... దేవస్థానానికి గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్రమోహన్‌ను సరెండర్ చేసింది. దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. 2016లో ఈవోగా ఈయన విశాఖలో సింహాచలం దేవస్థానంలో పనిచేసి, తాజాగా రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ -2గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈయనకు ప్రభుత్వం సడెన్ షాక్ ఇచ్చింది. 748 ఎకరాల భూ అవకతవకలపై విచారణ ప్రారంభించిన సంకేతాలను, ఆ అవకతవకలు జరిగిన సందర్భంగా ఈయన కూడా అక్రమాల్లో భాగస్వామ్యం అయినట్లు దేవాదాయశాఖ గుర్తించింది.