విశాఖపట్టణం, జూలై 2,
ఒకే కుటుంబంలో ఇద్దరు నాయకులు పోటీ పడడం పెద్ద విశేషమేమీ కాదు. అన్నదమ్ములు, బాబాయ్ అబ్బాయి, మామా అల్లుళ్ళు ఇలా చాలా బంధాలను ఇప్పటిదాకా అంతా చూశారు. అయితే చిత్రంగా ఒకే ఇంట్లో తండ్రీ కొడుకులు పదవుల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ ఇద్దరికీ ఆ పోటీ పెట్టింది జగన్ అంటే కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరే ఎవరో తేల్చుకుంటే పదవి ఒకటి ఇవ్వడం గ్యారంటీ అని వైసీపీ అధినాయకత్వం అంటున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఆ తండ్రీ కొడుకులు ఎవరూ అంటే విశాఖలో రాజకీయంగా ఢక్కా మక్కీలు తిన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్. ఎనిమిదేళ్ళ క్రితం అంటే 2013లోనే ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తి కావడంతో అధికార హోదాకు దూరమైన దాడి వీరభద్రరావుకు మళ్ళీ పెద్దల సభలో కూర్చోవాలని ఉందిట. అది ఆయన పంతం కూడా. తనను చంద్రబాబు పక్కన పెట్టి రెండు సార్లు యనమల రామకృష్ణుడికి ఆ పదవి ఇచ్చారు. తానేమి తక్కువ తిన్నానా అన్నది దాడి వీరభద్రరావు ఆలోచన. పైగా తాను ఎలాగైనా మళ్ళీ ఆ పదవిని దక్కించుకుని బాబు ముందు నిలబడాలన్న పట్టుదల కూడా ఆయనకు ఉంది. అందుకే ఆయన జగన్ వైపు వచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి గట్టిగా కృషి చేశారు. ఇక ఆయన కుమారుడు, రాజకీయ వారసుడు దాడి రత్నాకర్ కి కూడా పదవుల మీద ఆశ ఉంది. తండ్రితో సంబంధం లేకుండా తన సేవలకు గుర్తింపును ఆయన కోరుకుంటున్నాడు.విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి దాడి రత్నాకర్ పావులు కదుపుతున్నారు. ఈ పదవిలో ఇప్పటిదాకా ఉన్న యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు కుమారుడు సుకుమార వర్మ కూడా మరో సారి ట్రై చేస్తున్నారు. అయితే ఆయన ఇప్పటికే రెండు సార్లు ఈ పదవిలో ఉన్నదువల్ల ఈసారి మార్చి వేరే వారికి ఇవ్వాలని జగన్ ఆలోచన చేస్తున్నారుట. దాంతో తాను మాట ఇచ్చిన దాడి కుటుంబానికి ఆఫర్ ఇచ్చారని టాక్. కుమారుడు రత్నాకర్ కి ఆ పదవిని ఇచ్చి తండ్రి దాడి వీరభద్రరావు సేవలను పార్టీ కోసం వాడుకోవాలని జగన్ చూస్తున్నారుట.ఈ విషయంలో తేల్చుకోవాల్సింది దాడి వీరభద్రరావు ఫ్యామిలీయే అని అంటున్నారు. దాడి వీరభద్రరావుది నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. ఆయన అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు అనుభవించారు. మరి కుమారుడి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా పెద్దాయన వెనక్కి తగ్గితే డీసీసీబీ చైర్మన్ గా దాడి రత్నాకర్ నియామకం ఖాయమే అంటున్నారు. అలా కాదు తాను ఎమ్మెల్సీగా ఉండాలని దాడి వీరభద్రరావు ఆశ పడితే మాత్రం డీసీసీబీ వేరే వారికి వెళ్ళిపోతుంది. అయితే బలమైన గవర సామాజికవర్గానికి వైసీపీలో పదవులు పెద్దగా దక్కలేదు అన్న కారణం చూపించి తండ్రీ కొడుకులు ఇద్దరూ కుర్చీలు కోరుకుంటున్నారు అంటున్నారు. కానీ అక్కడ ఉన్నది జగన్, పైగా ఆయన మాట ఇచ్చిన మేరకు దాడి ఫ్యామిలీకి న్యాయం చేస్తూనే అందరికీ కూడా సమాన అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారుట. మొత్తానికి ఈ తండ్రీ కొడుకుల రేసులో ఎవరిని పదవి వరిస్తుందో చూడాల్సిందే.