విజయవాడ, జూలై 2,
జాతీయ రాజకీయాలు వచ్చే ఎన్నికల నాటికి అనేక రకాలుగా మారతాయి. కాంగ్రెస్, బీజేపీతో పాటు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలను తోసిరాజని అధికారంలోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కూడా రానున్న కాలంలో క్రియాశీల పాత్రను పోషించనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు జాతీయంగా డిమాండ్ పెరగనుంది.ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు బలంగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీల వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు. జగన్ మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు, కొన్ని ప్రాంతీయ పార్టీల అధినేతలతోనూ జగన్ టచ్ లో ఉన్నారని చెబుతున్నారు.ప్రధానంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. నిధుల విషయంలో కాని, ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలో తమ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని, కొన్ని ప్రాంతాలకే మోదీ అనుకూలంగా ఉన్నారన్న విమర్శలున్నాయి. దీంతో ప్రాంతీయ పార్టీల అధినేతలు మోదీ వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్నారు. శరద్ పవార్ లాంటి నేతలు కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం వెనక కూడా ఇదే కారణమని చెప్పాలి. అయితే దీనికి జగన్ దూరంగా ఉన్నా ఒక కీలక నేతతో టచ్ లో ఉన్నారంటున్నారు.ఇక బీజేపీ కూడా జగన్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేదు. దక్షిణాదిలో తమకు అండగా నిలిచే ఏకైక నేతగా బీజేపీ కేంద్ర నాయకత్వం జగన్ ను భావిస్తుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ అవసరం తమకు ఉంటుందని భావించిన కేంద్రం పెద్దలు జగన్ ను దువ్వే ప్రయత్నాలు ప్రారంభించారు. జగన్ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం వారికి అనుకూలంగానే ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద రానున్న కాలంలో జాతీయంగా జగన్ కు డిమాండ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.