YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కేంద్రకేబినెట్ విస్తరణకు అంతా రెడీ 2024 ఎన్నికల లక్ష్యం

కేంద్రకేబినెట్ విస్తరణకు అంతా రెడీ 2024 ఎన్నికల లక్ష్యం

న్యూఢిల్లీ, జూలై 2, 
ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల రోజులుగా వివిధ శాఖలతో ప్రధాని జరుపుతున్న సమీక్ష సమావేశాలు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగబోయే ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌తోపాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ, 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నట్టు తెలుస్తోంది.మిత్రపక్షాలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. ఇప్పటికే 27 మంది పేర్లను పరిశీలించినట్లు విశ్వసనీయ వర్గాల పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్‌‌లో గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలో చేపట్టడంలో కీలక పాత్ర పోషించిన జోతిరాదిత్య సింథియాకు కేబినెట్‌ హోదా ఖాయంగా కనిపిస్తోంది. బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీ, అసోం, మహారాష్ట్ర మాజీ సీఎంలు శర్వానంద సోనోవాల్‌, నారాయణ రాణెలకు చోటు దక్కనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది.యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్‌, ఎంపీ పంకజ్‌ చౌదరి, వరుణ్‌ గాంధీ, రీటా బహుగుణ జోషి, జాఫర్ ఇస్లామ్, అప్నాదల్‌ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్‌కు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉత్తరాఖండ్ నుంచి అజయ్ భట్ లేదా అనిల్ బలౌనీ, కర్ణాటక నుంచి ప్రతాప్ సింహా పేర్లు వినబడుతున్నాయి.అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చేలా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. బిహార్‌ నుంచి ఎల్జేపీ నేత పశుపతి పారస్‌, జేడీయూ ఎంపీలు ఆర్‌సీపీ సింగ్ (లలన్ సింగ్), సంతోష్‌ కుష్వాహా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ నుంచి జగన్నాథ్ సర్కార్, శంతను ఠాకూర్, నితీశ్ ప్రమాణిక్, హరియాణా నుంచి బ్రిజేంద్ర సింగ్ లేదా సునీతా దుగ్గల్‌ రేసులో ఉన్నారు.రాహుల్ కస్వాన్ (రాజస్థాన్), అశ్వని వైష్ణవ్ (ఒడిశా), పూనమ్ మహాజన్ లేదా ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర), పర్వేశ్ వర్మ లేదా మీనాక్షి లేఖి (ఢిల్లీ)లకు చోటు దక్కు అవకాశం ఉంది. పరిశ్రమలు, వాణిజ్యం, న్యాయ, వ్యవసాయం, విద్య, పౌర విమానయానం, ఆహార శుద్ధి తదితర శాఖల్లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకి ఈ సారైనా కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 2019 ఎన్నికల తర్వాత క్యాబినెట్‌లో తమకు ఒక్క మంత్రి పదవే ఇవ్వడంతో నితీశ్ కుమార్ తిరస్కరించిన విషయం తెలిసిందదీంతో ఈసారి ఆయన కనీసం రెండు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. లలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్, సంతోష్ కుష్వాహాలు ఆశావాహుల జాబితాలో ఉన్నారు.నిబంధనల ప్రకారం కేబినెట్‌లో 81 మంది మంత్రులు ఉండొచ్చు. కానీ, ప్రస్తుతం 53 మంది ఉండటంతో తాజా మంత్రివర్గ విస్తరణలో 28 మంది వరకు నియమించే అవకాశముంది.

Related Posts