హైదరాబాద్, జూలై 2,
దర్భంగా పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. హైదరాబాద్ నుంచి 35 కేజీల పార్సిల్‌ను పంపిన మాలిక్ బ్రదర్స్.. బట్టల మధ్యలో ఐఈడీ బాంబ్ పెట్టినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఎక్కడా తమ గుర్తింపు బయటపడకుండా మాలిక్ బ్రదర్స్ పార్సిల్ పంపినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.మహ్మద్ సూఫియాన్ పేరును పార్సిల్ సెండింగ్ రిసీవింగ్‌కు ఉగ్రవాదులు వాడారు. ఏఐబీపీఏ 9085సీ నంబర్‌తో ఉన్న పాన్‌కార్డ్‌ను మాలిక్ బ్రదర్స్ వాడారు. ఈ పాన్ కార్డ్ క్రియేషన్‌లో లష్కరే తొయిబా ముఖ్య నేత ఇక్బాల్ కీలకంగా ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.దర్భంగ రైల్వే స్టేషన్‌లో జరిగిన విస్ఫోటనం కేసులో అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను ఎన్‌ఐఏ అధికారులు గురువారం బిహార్‌కు తరలించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యులు ఇమ్రాన్ మాలిక్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్, మహ్మద్ నాసిర్ ఖాన్ అలియాస్ నాసిర్ మాలిక్‌లను గురువారం ఉదయం మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ వద్ద ఉన్న వారి ఇంటిలో సోదాలు చేశారు. కొన్ని పత్రాలు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాంపల్లిలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత బిహార్‌కు తీసుకెళ్లారు.