హైదరాబాద్, జూలై 2,
ఏపీ సీఎం వైఎస్ జగన్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్ధం అవుతోందనే టాక్ మొదలైంది. ‘యాత్ర’ సినిమాతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను తెరకెక్కించిన దర్శకుడు మహీ వి రాఘవన్.. జగన్ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇప్పటికే నటీనటుల ఎంపిక పూర్తయ్యిందని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట.జగన్ బయోపిక్‌లో ఆయన పాత్రలో ఎవరు నటిస్తారనేది హాట్ టాపిక్‌గా మారగా.. ‘స్కామ్ 1992’ నటుడు ప్రతీక్ గాంధీ హీరోగా నటించబోతున్నారట. ప్రతీక్ గాంధీ ఆహార్యం జగన్ పాత్రకు బాగా నప్పుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. కాగా, ప్రీతిక్ గాంధీ ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ ద్వారా ఎందరో అభిమానులను సంపాదించారు. 2020 లాక్‌డౌన్ సమయంలో ఈ వెబ్ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఎలాంటి బూతు డైలాగులు, శృంగారభరిత సన్నివేశాలు లేకుండా తెరకెక్కించిన ‘స్కామ్ 1992’ ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.ఇక జగన్ విషయానికి వస్తే.. యూత్, మహిళలు, పెద్దవారనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆయనకు ఫుల్ క్రేజ్ ఉంది. జగన్ రాజకీయ ప్రస్థానం ఓ సినిమా స్టోరీకి ఏమాత్రం తక్కువ కాదంటే ఆశ్చర్యం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టడం.. ఎంపీగా ఎన్నికైన కొన్నాళ్లకే తండ్రిని కోల్పోవడం.. ఆ తర్వాత ఓదార్పు యాత్ర కోసం పార్టీ అధినేత్రిని ధిక్కరించడం.. అక్రమాస్తుల కేసులు.. జైలు జీవితం.. సొంతంగా పార్టీ పెట్టడం.. ప్రతిపక్ష నేతగా పోరాటం.. తర్వాత సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజలకు చేరువ కావడం.. అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడం.. ముఖ్యమంత్రి అయ్యాక ప్రజారంజక పాలన ఇవన్నీ సామాన్య విషయాలేం కాదు. ఈ అంశాల మేళవింపుతో అద్భుతమైన సినిమాను తెరకెక్కించొచ్చు.వైఎస్సాఆర్ బయోపిక్ ‘యాత్ర’ అన్ని వర్గాలను ఆకట్టుకుని హిట్ సినిమాగా నిలవడంతో జగన్ బయోపిక్‌పైనా అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. వైఎస్ జగన్‌పై బయోపిక్ రానుందనే వార్తలతో సినిమా ఎలా ఉంటుందోనని జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అసలే టాలీవుడ్‌లో బయోపిక్‌ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో జగన్‌పై రానున్న బయోపిక్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాలి.వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాను 2019 ఎన్నికలకు ముందు రిలీజ్ చేశారు. మళయాళ స్టార్ హీరో మమ్ముట్టీ ఈ మూవీలో వైఎస్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా కమర్షియల్‌గా విజయవంతం కాలేకపోయినప్పటికీ.. అభిమానులను మాత్రం మెప్పించగలిగింది. డైరెక్టర్ మెహిర్ రాఘవపై ప్రశంసల జల్లు కురిసింది. దీంతో జగన్ బయోపిక్‌పైనా అంచనాలు మొదలైపోయాయి. ఈ సినిమా ఎలా ఉంటుందోనని జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.