YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

లలితా సహాస్రనామం అంటే ఏంటి అందులో ఏముంది తెలుసుకుందాము

లలితా సహాస్రనామం అంటే ఏంటి అందులో ఏముంది తెలుసుకుందాము

లలితా సహాస్ర నామాలు ఎన్నో రహస్యమైన సాధనలను ఎన్ని రహస్యాలు పొందు పరచుకున్న అద్భుతమైన తాంత్రికస్తోత్రము.అందుకే వీటిని లలితా రహస్య నామాలన్నారు. ఈ నామాలలో దాగి ఉన్న రహస్యసాధనలను డీకోడ్ చేసి మంత్రంగా ఉపాసించే పద్దతి ఒక విధానం, స్త్రోత్రం పారాయణ చేయడం ఒక విధానం..ఒక్కో నామాన్ని సంపుటికరణ, ధ్యానం హోమం చేసే విధానం ఉన్నాయి, శ్రీవిద్య లో సహస్ర నామం చాలా ప్రధాన మైన ఉపాసన అదేంటో చూద్దాము. ఇప్పుడు లలితా రహస్య నామాలలో ఎన్నెన్ని సాధనా మార్గాలు దాగున్నాయో తెలుసుకుందాము,  ఈ నామములు 'శ్రీమాతా' అన్న నామంతో మొదలై 'లలితాంబికా' అన్న నామంతో పరిపూర్ణం అవుతున్నాయి. 999 నామాలలో ఏ శక్తిస్వరూపం గురించైతే వర్ణన ఉన్నదో ఆ శక్తి యొక్క పేరు 'లలితాంబికా' అని వెయ్యవ నామంలో చెప్పబడింది.

'శ్రీమాతా శ్రీమహారాజ్నీ శ్రీమత్సింహాసనేశ్వరీ' అన్న నామంనుంచి ' హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి' అన్న నామం వరకూ లలితా దేవి చరిత్ర వర్ణింపబడింది.

'శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా' నుంచి 'మూలకూట త్రయ కళేబరా' అన్న నామం వరకూ శ్రీవిద్యా మంత్ర రహస్యమూ దాని సాధనా నిగూడంగా చెప్పబడినాయి.

'మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంది విభేదినీ' అన్న నామం నుంచి 'మహాశక్తి కుండలినీ బిసతంతు తనీయసీ' అన్న నామాలలో కుండలినీ యోగ సాధన,క్రియాయోగ సాధనలు చెప్పబడినాయి.

కులామృతైక రసికా కులసంకేత పాలినీ

కులాంగనా కులాంతస్థా కౌలినీ కులయోగినీ

కుశలా కోమలాకారా కురుకుళ్ళా కులేశ్వరీ

కులకుండాలయా కౌలమార్గ తత్పర సేవితా

కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ

కౌళినీ కేవలానర్ఘ కైవల్య పదదాయినీ

అన్న నామాలలో తంత్రమార్గమైన కౌలపధం సూచితమైంది.

'దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేర ముఖాంబుజా' అన్న నామంలో దక్షిణాచారం చెప్పబడింది.

'వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జితా' అన్న నామంలో వామాచారం చెప్పబడింది.  

'అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా' అన్న నామంలో సమయాచారం చెప్పబడింది.

భద్ర ప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్య దాయినీ

భక్తిప్రియా భక్తి గమ్యా భక్తివశ్యా భయాపహా

భక్తిమత్కల్ప లతికా పశుపాశ విమోచనీ

అన్న నామాలలో భక్తిమార్గం చెప్పబడింది.

నిరాధారా నిరంజనా నిర్లేపా నిర్మలా నిత్యా

నిరాకారా నిరాకులా అనిన నామాల నుంచి 

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా అనిన నామాల వరకూ నిర్గుణ పరబ్రహ్మతత్త్వం వర్ణింప బడింది.

మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా

మహాయాగ క్రమారాధ్యా మహాభైరవ పూజితా

శిరస్థితా చంద్రనిభా ఫాలస్తేంద్ర ధనుప్రభా

హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా

మొదలైన నామాలలో తంత్ర శాస్త్రం గర్భితమై ఉన్నది.

దశముద్రా సమారాధ్యా త్రిపురాశ్రీ వశంకరీ

జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞాన జ్ఞేయ స్వరూపిణీ

యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా

రహోయాగ క్రమారాధ్యా రహస్తర్పణ తర్పితా

విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూ:

అనే నామాలలో దశముద్రా విధాన పూర్వక శ్రీవిద్యా తంత్రసాధన రహస్యంగా సూచింపబడింది.

మనువిద్యా చందవిద్యా చంద్రమండల మధ్యగా

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా

శ్రీ షోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా

అనే నామాలలో మంత్రశాస్త్రం నిబిడీకృతమై ఉన్నది. మంత్రశాస్త్రంలో పురుష దేవతల మంత్రాలను 'మంత్రాలని', స్త్రీదేవతల మంత్రాలను 'విద్యలని' అంటారని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే 'శ్రీవిద్య' అంటే శ్రీమాత యొక్క మంత్రరాజమని అర్ధం.

పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మ స్వరూపిణీ

సృష్టి కర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ

సంహారిణీ రుద్రరూపా తిరోధాన కరీశ్వరీ

సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా

అనే నామాలలో సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములనే అయిదు పనులు నిత్యమూ చేస్తున్న సగుణ రూపిణి యైన మహాశక్తి వర్ణితమైంది.

కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞా కామపూజితా

శృంగార రస సంపూర్ణా జయా జాలంధర స్థితా

ఓడ్యాణ పీఠ నిలయా బిందుమండల వాసినీ

అనే నామాలలో హఠయోగ సాధనలో ఉపయోగించే బంధత్రయం చెప్పబడింది.

గాయత్రీ వ్యాహృతిస్సంధ్యా ద్విజబృంద నిషేవితా

మొదలైన నామాలలో గాయత్రీ ఉపాసన చెప్పబడింది.

'విశుద్ధి చక్ర నిలయా రక్తవర్ణా త్రిలోచనా' నుంచి 'సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణీ' అనే నామం వరకూ శ్రీవిద్యాసాధనలో ఆచరింపబడే తాంత్రిక కుండలినీ న్యాసం చెప్పబడింది.

'మైత్ర్యాది వాసనా లభ్యా మహా ప్రళయ సాక్షిణీ' 

మొదలైన నామాలలో బౌద్ధంలో ఆచరించే బ్రహ్మవిహార సాధన రహస్యంగా చెప్పబడింది.

ఈ విధంగా భక్తి, జ్ఞానము, యోగము, తంత్రము, కుండలినీసాధన, సగుణ నిర్గుణ బ్రహ్మ తత్త్వములు, అనేక రకాలైన ధ్యానవిధానములు, అనేక మంత్రములు దండలో పూలలాగా గుచ్చబడి మనకీ స్తోత్రంలో ఇవ్వబడినాయి. ఇలాంటి ప్రక్రియ ఇతరములైన సహస్రనామాలలో ఎక్కడా మనకు కనిపించదు.

కనుక, లలితాసహస్ర నామములనేవి చాలా ప్రత్యేకతను సంతరించుకున్నట్టి స్తోత్రము లలితా సహస్ర నామాలు' పారాయణ గ్రంధం కాదు అది ఆచరణ గ్రంధం' .

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts