హైదరాబాద్, జూలై 3,
అనుకున్నట్లే జరుగుతుంది. బీజేపీ ఇన్నాళ్లూ కాచుక్కూర్చున్న సమయం వచ్చినట్లే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే వీలుంది. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జుత్తు మోదీ చేతిలో పెట్టినట్లయింది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నదమ్ముల్లా కలసి ఉందామని అనుకున్నారు. తొలి ఆరేళ్లు సక్రమంగానే జరిగిపోయాయి. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసుతో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటలు లేకుండా పోయాయి. అయితే అప్పట్లో ఎలాంటి రాష్ట్రానికి సంబంధించిన వివాదాలు తలెెత్తలేదు. చంద్రబాబు హైదరాబాద్ ను వీడిపోవడమే తన విజయమని భావించి కేసీఆర్ గమ్మున ఉన్నారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో కేసీఆర్ తో సత్సంబంధాలు కొనసాగించారు. ఇద్దరి మధ్య అనేక సమావేశాలు జరిగాయి. చంద్రబాబు కంటే జగన్ హయాంలోనే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగుంటాయని భావించారు. కానీ జలవివాదం ఇప్పుడు ముదిరిపోయింది. ఎవరికి వారు రాష్ట్ర ప్రయోజనాలంటూ రోడ్డెక్కే పరిస్థిితికి వచ్చింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడాన్ని, రాజోలిబండ డైవర్షన్ పనులను తెలంగాణ తప్పుపడుతుంది. గతంలో నిర్మించిన ప్రాజెక్టుల మాటేంటని ఏపీ రివర్స్ కౌంటర్ ఇస్తుంది. మాటల దాడితో ఇవి ఆగలేదు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని తోడుతూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని ఏపీ ఆరోపిస్తుంది. నిన్న మొన్నటి వరకూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు మాత్రమే ఫిర్యాదులు చేసిన రెండు రాష్ట్రాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దల ఎదుట పంచాయతీ పెట్టాయి. తొలుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కు ఫిర్యాదు చేయగా, తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏకంగా మోదీకే ఫిర్యాదు చేశారు. వివాదంలో జోక్యం చేసుకోవాలని కోరారు. అది చాలదు మోదీకి. అసలే దక్షిణాదిన బలహీనంగా ఉన్న బీజేపీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్న కమలనాధులకు ఈ పంచాయతీ కలసి వచ్చేట్లే కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల తగువును నానుస్తూ తమకు అనుకూలంగా మార్చుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగా కలసి కూర్చుని పరిష్కరించుకోవాల్సిన సమస్యను మాయలోడి చేతిలో పెట్టారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.