తిరుపతి, జూలై 3,
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం.. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కలిసొచ్చిన నియోజకవర్గం. చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా ఎదుగుతూ వచ్చిన కిరణ్.. చిత్తూరు జిల్లా వాయల్పాడు(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత వైఎస్సార్ మరణం, రోశయ్య సీఎం బాధ్యతల నుంచి తప్పుకోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో కిరణ్‌కు ఊహించని విధంగా సీఎం పీఠం దక్కిన విషయం తెలిసిందే.అయితే దశాబ్దాల పాటు చింతల రామచంద్రారెడ్డి, నల్లారి కుటుంబానికి ప్రత్యర్ధిగా ఉంటున్నారు. టీడీపీలో ఒకసారి ఎమ్మెల్యే అయిన చింతల, కిరణ్‌పై పలుమార్లు ఓటమి పాలయ్యారు. ఇక 2009లో పీలేరులో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో చింతల వైసీపీ నుంచి నిలబడగా, జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ పోటీ చేశారు. కానీ గెలుపు మాత్రం చింతలకే దక్కింది. 2019 ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. కాకపోతే నల్లారి కిషోర్ టీడీపీ నుంచి నిలబడి ఓడిపోయారు. ఇలా నల్లారి ఫ్యామిలీకి ప్రత్యర్ధిగా ఉన్న చింతల…ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్నారు.ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న చింతల…ఇప్పుడు ఏదైనా పదవి దక్కకపోదా? అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏదైనా పదవి దక్కకపోతే భవిష్యత్‌లో మళ్ళీ ఛాన్స్ దొరకదని భావిస్తున్నారు. మొదట్లోనే కేబినెట్‌లో తనకు చోటు దక్కుతుందని చింతల భావించారు. కానీ సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా చింతలకు మంత్రి పదవి దక్కలేదు. అలా అని వేరే నామినేటెడ్ పదవులు సైతం చింతలకు దక్కలేదు.ఈ క్రమంలోనే జగన్ కేబినెట్‌లో మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చింతల…జగన్‌ని కలవనున్నారని తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా ఏదొక పదవి దక్కించుకోవడానికే చింతల రెడీ అయ్యారని, ఈ సారి ఏ పదవి దక్కకపోతే, మళ్ళీ ఛాన్స్ రాదేమో అనే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది. చూడాలి మరి నల్లారి ఫ్యామిలీ ప్రత్యర్ధికి జగన్ ఎలాంటి అవకాశం ఇస్తారో?