YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దిశ ఏ దశకు

దిశ  ఏ దశకు

విజయవాడ, జూలై 3, 
ఆంధ్రాలో రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. దేశంలో చాలా రాష్ట్రాలు కరోనా నుంచి బయటపడ్డాయి. ఏపీకి మాత్రం ఆ వేదన పూర్తిగా తొలగిపోలేదు. కొంచెం తెరపి ఇచ్చింది. పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేయలేదు. అప్పుడే రాజకీయాల్లో గ్యాప్ వచ్చేసిందని నాయకులు రంగంలోకి దిగిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కరోనా బాధితుల పేరుతో సాధన దీక్ష చేశారు. ఇంకోవైపు అమల్లోకి రాని చట్టానికి ఒక యాప్ తెచ్చి అదో వింతగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చారు. నిజానికి రాష్ట్రం గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ నీటి వనరులపై ఒత్తిడి పెంచింది. ఏపీ , తెలంగాణల మధ్య పెరుగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాద్యత కేంద్రంపై ఉంది. రాజకీయ అవసరాల దృష్ట్యా కేంద్రం సైతం తెలంగాణ వైపే మొగ్గు చూపే పరిస్థితులున్నాయి. కానీ పేరు గొప్ప పెద్ద నాయకులిద్దరూ దీనిపై మాట్టాడేందుకు సాహసించడం లేదు. కనీసం పార్టీల అధినేతలుగా తమ విధానం కానీ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కానీ ప్రకటించడం లేదు. రాష్ట్రంలో అంతర్గతంగా చక్కదిద్దుకోవాల్సిన అంశాలపై మాత్రం రచ్చ చేస్తున్నారు. అవకాశ వాదానికే అగ్రతాంబూలమని మళ్లీ మళ్లీ చాటి చెబుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టే కొద్దీ ఈ గొడవ మరింతగా ముదురుపాకాన పడటం ఖాయం. తాజాగా మహిళా రక్షణ అంశంపై వైసీపీ, టీడీపీలు రచ్చ మొదలు పెట్టాయి. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ‘దిశ ’ చట్టం దేవతా వస్త్రం. అది అమల్లోకి వచ్చే అవకాశాలు లేవు . పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే అవకాశాలు శూన్యం. అయినా అది అమల్లోనే ఉందన్న విధంగా నమ్మబలుకుతోంది ప్రభుత్వం. తెలంగాణలో మహిళపై చోటు చేసుకున్న తీవ్రమైన ఘాతుకాన్ని ఆసరాగా చేసుకుంటూ అప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ దిశ బిల్లును ఆమోదించింది. భారత నేరస్మతికి సంబంధించిన చట్టాల మార్పులు పార్లమెంటుతోనూ, రాష్ట్రపతి ఆమోదంతోనూ ముడి పడి ఉంటాయి. మహిళలకు సత్వర న్యాయం అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని తప్పు పట్టలేం. కానీ ఆచరణాత్మకం కాని ఆశయం వృథా ప్రయత్నం. దిశ బిల్లును ఆమోదించి ఏళ్లు గడుస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడానికి ఇదే కారణం. అందులోనూ వాస్తవికతకు దూరంగా బిల్లును రూపకల్పన చేయడంలోనే అపరిపక్వత కనిపించింది. రెండు వారాల్లో దర్యాప్తు పూర్తి, నాలుగు వారాల్లో శిక్ష వంటి అసాధారణ వేగం అమలుకు నోచుకునే పరిస్థితి ఉండదు. ప్రస్తుతమున్న చట్టాలను పకడ్బందీగా అమలు చేసి, వేగాన్ని పెంచి, పోలీసుల్లో జవాబుదారీతనం కల్పిస్తే మహిళలకు న్యాయం జరుగుతుంది. అమల్లో ఉన్న చట్టాలే చాలావరకూ యంత్రాంగం నిర్లక్ష్యం, నిర్లిప్తతల కారణంగా ఆచరణకు నోచుకోవడం లేదు. అందువల్ల మహిళా రక్షణ పై అమల్లో లేని చట్టం ప్రచారానికి తప్ప ఎందుకూ కొరగానిదనే చెప్పాలి.నిజానికి చంద్రబాబు నాయుడు తన సాధన దీక్షకు కౌంటర్ ‘ దిశ’ యాప్ విడుదల అని భావించారు. అది రాజకీయ విమర్శ. బాబు దీక్షను చూసి ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారనుకోవడం భ్రమే. పైపెచ్చు కరోనా బాధితుల అంశానికి, మహిళా రక్షణకు సంబంధమే లేదు. అయినా ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవాలనే తలంపుతోనే ఈ ఆరోపణకు దిగారు. కానీ యాప్ లోని ఫీచర్లు మాత్రం మహిళలకు చాలా ఉపయోగకరంగా తీర్చిదిద్దడం మంచి పరిణామం. తాను కష్టాల్లో పడ్డప్పుడు సమీప పోలీసు స్టేషన్లకు తెలిపే ప్రత్యేక నంబర్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. అయితే అనుమానాస్పద వాతావరణం ఉన్నప్పుడు సమీప పోలీసు స్టేషన్లను అలర్ట్ చేసే ‘ట్రాక్ మై ట్రావెల్’ ఫీచర్ మాత్రం కచ్చితంగా మహిళల రక్షణకు ఉపకరిస్తుంది. మహిళలను చెరపట్టే వాళ్లు చాలా జాగ్రత్తగా నీడలాగా వెంటాడి హాని చేస్తుంటారు. ముందస్తుగానే వాతావరణం చాలావరకూ తెలిసిపోతుంటుంది. అటువంటి పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగాన్ని అలర్ట్ చేయడమనేది చాలా అవసరం. సంఘటన జరిగిన తర్వాత కంటే ముందుగా మేలుకొనే రీతిలో యాప్ రూపకల్పన చేయడం వినూత్నమనే చెప్పాలి. అదే విధంగా యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారు నేరాలు ఎక్కువ గా జరిగే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా అలర్ట్ అయ్యే విధానమూ ఇందులో ప్రత్యేకత. మొత్తానికి అన్నిటినీ రాజకీయాలతో ముడి పెట్టకుండా ఇటువంటి అంశాలపై పార్టీలన్నీ బాధ్యత తీసుకుంటే మహిళలకు రక్షణ దొరుకుతుంది.చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడంలో ఒకరికంటే ఒకరు మించిపోతున్నారు. చంద్రబాబును ఆర్థిక మూలాల నుంచి దెబ్బతీయాలని జగన్ చూస్తున్నారు. అమూల్ డైరీని ప్రభుత్వం దాదాపు దత్తత తీసుకుని మరీ ప్రమోట్ చేస్తోంది. రాష్ట్రంలో అనేక డెయిరీలు దెబ్బతిని ఉన్నా పట్టించుకోవడం లేదు. హెరిటేజ్ ను ప్రజలకు దూరం చేయడంలో భాగంగా అమూల్ పై విశ్వాసం పెంచుతున్నారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సైతం జగన్ ఆర్థిక మూలాలున్న సంస్థలను ప్రభుత్వ పరంగా దెబ్బతీయడానికి ప్రయత్నించారు. తాజాగా పక్కనున్న తమిళనాడును చూసి ముఖ్యమంత్రి నేర్చుకోవాలంటూ చంద్రబాబు సుద్దులు మొదలు పెట్టారు. అమ్మ క్యాంటీన్లను స్లాలిన్ కొనసాగించడాన్ని ప్రస్తావించారు. మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ ని కొనసాగించకుండా ఎన్టీయార్ వైద్య సేవగా ఎందుకు మార్పు చేశారో చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే తన పేరుతోనే ప్రభుత్వ పథకాలను రకరకాలుగా అమలు చేసిన ఘనత కూడా చంద్రబాబుదే. అదే ఒరవడిని జగన్ కూడా కొనసాగిస్తున్నారు. చంద్రన్న తోఫా, చంద్రన్న కానుకలు అప్పటి పథకాలైతే జగనన్న అమ్మ ఒడి, జగనన్న దీవెన నేటి పథకాలు. మొత్తమ్మీద ఈ గురివింద రాజకీయ వేత్తల వల్ల రాష్ట్రం నష్టపోతోంది. కేంద్రంతోనూ, ఇతర రాష్ట్రాలతోనూ డీల్ చేయాల్సిన సీరియస్ విషయాలపై ఇద్దరు నాయకులూ శ్రద్ధ పెట్టడం లేదు.

Related Posts