ఏలూరు, జూలై 3,
మొత్తానికి బీజేపీ కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు రెడీ అవుతోంది అని ఢిల్లీ వర్గాల భోగట్టా. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తి అయినా కొందరు మంత్రుల పనితీరులో ఏ మాత్రం మెరుగుదల లేదు, అలాగే కొందరు మరణించారు. మరి కొందరు మంత్రులకు అదనపు శాఖలు వెళ్ళాయి. వారంతా పని భారంతో ఒత్తిడికి లోను అవుతున్నారు. ఇక వీటితో పాటు దేశంలోని 28 రాష్ట్రాలలో కొన్ని చోట్ల అసలు కేంద్ర ప్రాతినిధ్యమే లేదు. దాంతో పాటుగా ముంచుకు వస్తున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలు. ఇవన్నీ కూడా మోడీని విస్తరణకు రెడీ అవమని చెబుతున్నాయి.ఇక ఏపీ నుంచి చూసుకుంటే మూడేళ్ళుగా కేంద్ర మంత్రివర్గంలో ఎవరూ లేరు. చంద్రబాబు తన మంత్రులను 2018 మార్చిలో వెనక్కి పిలిపించి రాజీనామాలు చేయించారు. ఇక 2019 తరువాత వైసీపీ పవర్ లోకి వచ్చింది. జగన్ కేంద్రంలో చేరలేదు. దాంతో ఏపీ నుంచి ఏ ఒక్కరూ లేకుండా పోయారు. ఆ లోటుని ఈసారి భర్తీ చేస్తారు అంటున్నారు. అయితే బీజేపీకి ఇక్కడ ఎంపీలు ఎవరూ లేరు దాంతో అయితే వైసీపీ, లేకపోతే జనసేనల నుంచే కొత్త మంత్రులను ఎన్నుకోవాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మీదనే కమలం చూపు ఉంది అంటున్నారు.పవన్ కల్యాణ్ స్వయంగా చాన్నాళ్ల క్రితం ఒక మాట చెప్పారు. తన పార్టీని నాడు బీజేపీ పెద్దగా ఉన్న అమిత్ షా విలీనం చేయమన్నారు అని. తాను మాత్రం ఆ పని చేయనే చేయను అని చెప్పాను అని కూడా గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఇపుడు మరోసారి విలీనం ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ జనసేన పేరుకు మాత్రమే ఉంది. ఆయన నాదెండ్ల మనోహర్ తప్ప మూడవ నాయకుడు పేరు ఎవరూ చెప్పలేరు. క్యాడర్ అనబడే అభిమానులు ఉన్నారు. వారిని సంఘటితం చేస్తే పనితనం కూడా జనసేనకు లేదని ఏడేళ్ళ ప్రస్థానంతో తేలిపోతోంది. దాంతో పవన్ కల్యాణ్ రాజకీయంగా దూకుడు చేయాలంటే బీజేపీలోకి జనసేనకు కలిపేయమని ఢిల్లీ పెద్దలు వత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది.సరిగ్గా ఇదే విషయంలో చిరంజీవిని గుర్తు చేసుకోవాలి. ఆయన తన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను అందరికీ కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఇపుడు పవన్ కల్యాణ్ వెనక ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వైసీపీకి జై కొడుతున్నాడు. అయినా సరే పవన్ కల్యాణ్ కి యూత్ లో ఉన్న చరిష్మాను దృష్టిలో ఉంచుకుని బీజేపీ బిగ్ ఆఫర్ ఇస్తోంది. ఆయన పార్టీని విలీనం చేస్తే కేంద్ర మంత్రిని చేస్తామని కూడా హామీ ఇస్తోంది. మరి ఈ విషయంలో పవన్ ఆలోచించుకుంటే అనూహ్యంగా కొత్త కేంద్ర మంత్రి ఆయనే అవుతారు. అలా బీజేపీ మనిషిగానే పవన్ కల్యాణ్ కి మోడీ టీమ్ లో చోటు ఉంటుంది తప్ప జనసేనాని గా తీసుకోరు అంటున్నారు. అంటే గట్టి షరతే పెట్టారన్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.