YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. 7 సంవత్స రాలలో చూసాం : హరీశ్‌రావు

డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. 7 సంవత్స రాలలో చూసాం : హరీశ్‌రావు

సిద్దిపేట జూలై 3
డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామంలో నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా డంప్‌ యార్డులను నిర్మిస్తున్నామన్నారు. చెత్తను తీసుకు వెళ్లేందుకు ట్రాక్టర్‌, ట్రాలీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అంత్యక్రియలకు ఇబ్బందులు లేకుండా శ్మశాన వాటికలు తదితర మౌలిక వసతులు సమకూర్చుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు క్షీరసాగర్‌ గ్రామంలో రూ.6.62 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కొత్తగా రూ.1.06 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు చెప్పారు.గ్రామంలో పోస్టాఫీస్‌, లైబ్రరీ పూర్తి చేయిస్తానని గ్రామస్తులకు మంత్రి భరోసా ఇచ్చారు. గ్రామంలో అసంపూర్తి పారిశుధ్య పనులు, డ్రైనేజీ నిర్మాణ పనులు, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో రూ.50లక్షలతో సీసీ రోడ్లు, రూ.50లక్షలతో విలేజ్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్‌ కాపీలను మంత్రి అందజేశారు. కొండపోచమ్మ జలాశయంతో పామాయిల్‌ తోటల పెంపకానికి మండలం అనువుగా మారిందని, తోటల పెంపకం కోసం మొక్కలు, ఎరువులు.. ఇతరత్రా పంటల సాగుకయ్యే వనరులను సమకూర్చడంతో పాటు ఇవ్వనున్న సబ్సిడీలపై గ్రామస్తులకు వివరించారు.పామాయిల్‌ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి పామాయిల్‌ పంటను కొనుగోలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పామాయిల్‌ సాగుకు ముందుకు వచ్చిన రైతు బాల్‌రెడ్డిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. వ్యవసాయ క్షేత్రంలో మొక్క పామాయిల్‌ మొక్క నాటి.. సాగుకు శ్రీకారం చుట్టారు. మంత్రి వెంట ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
క్షీరసాగర్‌ గ్రామంలో రూ.1.6కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.40లక్షలతో నిర్మించి అదనపు తరగతి గదులను ప్రారంభించారు. రూ.30లక్షల వ్యయంతో పూర్తయిన యూడీసీ-అండ్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను, ఆ తర్వాత గ్రామ మోడల్‌ బస్టాండ్‌, ప్రయాణ ప్రాంగణాన్ని, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. రూ.20లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్‌, రూ.50లక్షలతో విలేజీ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు గ్రామ పర్యటనకు వచ్చిన మంత్రికి డప్పుచప్పులు, బోనాలు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పల్లె ప్రగతిలో భాగంగా హరితహారం కింద పల్లె ప్రకృతి వనం వద్ద మంత్రి మొక్కలు నాటడంతో పాటు ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున గ్రామస్తులకు పంపిణీ చేశారు.

Related Posts