డెహ్రాడూన్ జూలై 4 : ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి ఎన్నికయ్యారు. ఈ మధ్యాహ్నం 3.00 గంటలకు ఉత్తరాఖండ్‌లోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్, ఇతర సీనియర్ బీజేపీ నాయకుల సమక్షంలో ఉత్తరాఖండ్ బీజేఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి తమ కొత్త నాయకుడిగా పుష్కర్‌సింగ్ ధామిని ఎన్నుకున్నారు.బీజేఎల్పీ నేతగా పుష్కర్‌సింగ్ ధామి ఎన్నిక కావడంతో ఇక ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవిని లాంఛనమే కానుంది. గత మార్చిలో సమర్థంగా పనిచేయలేకపోతున్నారనే కారణంతో అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌ను పదవి నుంచి తప్పించి తీరథ్ సింగ్ రావత్‌కు ఆ పదవిని అప్పగించింది. అయితే ప్రస్తుతం ఎంపీగా తీరథ్‌సింగ్ రావత్ సెప్టెంబర్ 10వ తేదీ లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది.అయితే కరోనా మహమ్మారి విస్తృతి, వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విముఖత వ్యక్తం చేసింది. దాంతో తీరథ్‌సింగ్ రావత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన రాజీనామా చేయడంతో ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామిని ఎన్నుకున్నారు.