డెహ్రాడూన్ జూలై 4: ఉత్తరాఖండ్ సీఎం బాధ్యతల నుంచి తీరథ్ సింగ్ రావత్ తప్పుకున్న విషయం తెలిసిందే. 115 రోజుల పాటు సీఎంగా ఉన్న ఆయన అనూహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎంపీగా ఉన్న ఆయన ఏదైనా స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తేనే సీఎంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నిజానికి తీరథ్ సింగ్ విషయంలో ఓ విచిత్ర పరిస్థితి ఎదురైంది. కోవిడ్ సంక్షోభం వల్ల ఏకంగా ఆయన తన సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఉత్తరాఖండ్ సీఎంగా తీరథ్ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన సీఎం నివాసానికి కూడా వెళ్లలేదు. సీఎం నివాసాన్ని కోవిడ్ కేర్ సెంటర్‌గా ప్రకటించిన ఆయన.. తన స్వంత ఇంట్లోనే ఉన్నారు. అయితే మార్చి 22వ తేదీన రావత్‌కు కోవిడ్ సంక్రమించింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. కానీ మార్చి 23వ తేదీన ఎన్నికల సంఘం సాల్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ప్రకటించింది.
పాజిటివ్‌గా ఉన్న తీరథ్.. ఆ సమయంలో ఆ స్థానం కోసం పోటీ చేయలేకపోయారు. వాస్తవానికి సాల్ట్ అసెంబ్లీ స్థానం నుంచి తీరథ్‌ను గెలిపించాలన్న ఉద్దేశంలో బీజేపీ ఉంది. కానీ 14 రోజులు ఐసోలేషన్‌లో ఉన్న రావత్ మళ్లీ ఏప్రిల్ 4వ తేదీన నెగటివ్‌గా బయటకు వచ్చారు. అయితే సాల్ట్ నియోజకవర్గానికి నామినేషన్ వేయడానికి మార్చి 30వ తేదీ చివరి తేదీ కావడం తీరథ్‌ను ఇరకాటంలో పడేసినట్లు అయ్యింది. ఎంపీగా రాజీనామా చేసి.. ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా గెలిస్తేనే సీఎం పదవిలో ఆయన కొనసాగే అవకాశం ఉంది. కానీ ఆర్నెళ్ల గడువు సమీపస్తున్న తరుణంలో తీరథ్‌కు ఆ రూటు కష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పట్లో ఈసీ మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా లేదు. సాల్ట్ నియోజకవర్గానికి ఏప్రిల్ 17వ తేదీన జరిగిన ఎన్నికలో బీజేపీ సునాయాస విజయం దక్కించుకున్నది. కోవిడ్ వల్ల ఆ స్థానం నుంచి పోటీ చేయలేకపోయిన తీరథ్‌కు ఇప్పుడు తీవ్ర నిరాశే మిగిలింది. ఏప్రిల్‌లో కుంభమేళా వేళ నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఫేక్ రిపోర్ట్‌లు కూడా తీరథ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపాయి.