YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేబినెట్ కసరత్తులు... ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు

కేబినెట్ కసరత్తులు... ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు

విజయవాడ, జూలై 5, 
ప్రస్తుతం క‌రోనా క‌ష్టకాలంలో రాజ‌కీయాల గురించి పెద్దగా మాట్లాడుకోవ‌డానికేం లేదు. అయితే మ‌రో మూడు, నాలుగు నెల‌ల్లో ఏపీ కేబినెట్ ప్రక్షాళ‌న ఉండ‌డంతో కేబినెట్‌లో ఎవ‌రు కొత్తగా వ‌స్తారు ? ఎవ‌రు ఉంటారు ? ఎవ‌రు వెళ‌తారు ? ఇవే కాస్త గ‌రంగంగా వినిపిస్తున్నాయి. ఈ సారి ఏయే జిల్లాల నుంచి ఎవ‌రు వెళ‌తారు ? ఎవ‌రు కొత్తగా కేబినెట్లోకి వ‌స్తార‌న్నదే హాట్ టాపిక్‌. అయితే కీల‌క‌మైన క‌ర్నూలు జిల్లాలో ఈ సారి ఈక్వేష‌న్లు సెట్ చేయడం జ‌గ‌న్‌కు క‌త్తిమీద సాములా మారింద‌న్నది నిజం. తొలి ట‌ర్మ్ కేబినెట్ లో జ‌గ‌న్ జిల్లాలో రెడ్డి సామాజిక వ‌ర్గంతో పాటు బీసీల‌కు చెరో ప‌ద‌వి ఇచ్చారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీనియ‌ర్‌. ఆయ‌న రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ వ‌ర్గంలోనే శిల్పా చ‌క్రపాణి రెడ్డి, కాట‌సాని రాంభూపాల్ రెడ్డి లాంటి సీనియ‌ర్లు ఉన్నా స‌బ్జెక్ట్ ఉండడంతో పాటు ఆర్థిక వ్యవ‌హారాల్లో మంచి ప‌ట్టు ఉండ‌డం.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీఏసీ చైర్మన్‌గా నాటి అధికార పార్టీ నేత‌ల‌ను ముప్పుతిప్పలు పెట్టడంతో జ‌గ‌న్ బుగ్గన‌కు కీల‌క‌మైన ఆర్థిక‌శాఖ క‌ట్టబెట్టారు.ఇక బీసీ కోటాలో ప్రజారాజ్యం పార్టీ నుంచి వైసీపీలోకి వ‌చ్చి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జ‌య‌రాంకు ప‌ద‌వి వ‌చ్చింది. ఇప్పటి వ‌ర‌కు బాగానే ఉన్నా ప్రక్షాళ‌న‌లో మాత్రం జ‌గ‌న్‌కు చాలా జిల్లాల్లో త‌ల‌నొప్పులు ఉన్నట్టుగానే క‌ర్నూలులోనూ త‌ల‌నొప్పులు త‌ప్పేలా లేవు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఇద్దరిని కంటిన్యూ చేసే ఛాన్సులు అయితే లేవు. బుగ్గన కంటిన్యూ అవుతార‌నే ఎక్కువ మంది అంటున్నారు. బీసీ మంత్రిగా ఉన్న జ‌య‌రాంను త‌ప్పిస్తే మ‌రో బీసీ ఎమ్మెల్యే లేరు. ఎస్సీ ఎమ్మెల్యేలు తొగురు ఆర్థర్‌, డాక్టర్ సుధాక‌ర్ ఇద్దరూ తొలిసారి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎమ్మెల్యేలు అయ్యారు. పైగా వీరిద్దరు అంత దూకుడుగా కూడా ఉండ‌రు. ఎస్సీ కోటాలో వీరిక‌న్నా మిగిలిన జిల్లాల్లో చాలా మంది సీనియ‌ర్లు ఉన్నారు. జ‌య‌రాంను త‌ప్పించి రెండో బెర్త్ ఇస్తే మ‌ళ్లీ రెడ్డి నేత‌కే ఇవ్వాల్సి ఉంది.మంత్రాలయ‌ంలో సీనియ‌ర్ నేత బాల నాగిరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్రపాణి రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బ‌ల‌మైన లాబీయింగ్ స్టార్ట్ చేసేశారు. ఈ ముగ్గురు నేత‌లు కూడా సీనియ‌ర్లే కావ‌డంతో ఎవ‌రికి వారే త‌మ‌కే ప‌ద‌వి ఇవ్వాలంటున్నారు. సాయి ప్రసాద్ రెడ్డి, రెండు సార్లు, బాల నాగిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేలు. వీరిద్దరు సోద‌రులే కావ‌డంతో అండ‌ర్ స్టాండింగ్‌తో ముందుకు సాగుతున్నార‌ట‌. ఇక నంద్యాల ఉప ఎన్నిక టైంలో పార్టీలో చేరిన శిల్పా చ‌క్రపాణి రెడ్డి త‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా వ‌దులుకున్నారు. ఇప్పుడు ఆయ‌న కూడా త‌నకు జ‌గ‌న్ నాడే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ చెప్పేసుకుంటున్నారు. మైనార్టీ కోటాలో అంజాద్ బాషాను త‌ప్పిస్తే త‌నకే ప‌ద‌వి వ‌స్తుంద‌ని క‌ర్నూలు సిటీ ఎమ్మెల్యే మ‌హ్మద్ హ‌ఫీజ్ ఖాన్ ప్రచారం చేసుకుంటున్నారు. జ‌య‌రాంను త‌ప్పిస్తే రెండో ఛాన్స్ కూడా జ‌గ‌న్ రెడ్లకే ఇస్తారా ? లేదా ఊహించ‌ని విధంగా మైనార్టీల‌కు ఇస్తారా ? అన్నది చూడాలి.

Related Posts