ఏలూరు, జూలై 5
రఘురామ కృష్ణరాజు విషయంలో వైసీపీ సీరియస్ గా ఉంది. ఇటీవల స్పీకర్ కు మరోసారి ఆయన పై అనర్హత వేటు వేయాలని లేఖ రాసింది. దీనిపై కూడా స్పందన రాకపోతే కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవ్వాలని వైసీపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని, పార్టీ అధినేతకు వ్యతిరేకంగా ఎన్ని కామెంట్స్ చేస్తున్నా రఘురామ కృష్ణరాజుపై చర్యలు తీసుకోకపోవడంపై జగన్ సయితం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.జగన్ తన ఢిల్లీ పర్యటనలోనూ రఘురామ కృష్ణరాజు విషయాన్ని చర్చించారు. తమ పార్టీకి చెందిన ఎంపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గత ఏడాది జులై 3న లోక్ సభ స్పీకర్ ను వైసీపీ నేతలు కోరారు. అయితే ఇంత వరకూ దానిపై చర్యలు తీసుకోలేదు. అంతటితో ఆగకుండా పదకొండు నెలల తర్వాత పిటిషన్‌ను సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం సవరించాలని కోరుతూ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసు రావడాన్ని వారు అభ్యంతరం చెబుతున్నారు.జాప్యం చేయాలనే ఇలా చేస్తున్నారన్న అసహనం వైసీపీలో వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రఘురామ కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాల్సిందేనంటున్నారు వైసీపీ నేతలు. ఈ జాప్యం కె. మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పునకు విరుద్ధమవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అనర్హత పిటీషన్ లను మూడు నెలల సమయంలోగా పరిష్కరించాల్సి ఉన్నా ఏడాది గడుస్తున్నా అతీగతీ లేదంటున్నారు.మరోవైపు రఘురామ కృష్ణరాజు పార్టీని, ప్రభుత్వాన్ని రోజు ఇరుకునపెడుతుండటంతో ఇక తాడో పేడో తేల్చుకోవాలని సిద్దమయ్యారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పెద్దలపై వత్తిడి తేవాలని భావిస్తున్నారు. తమకు కావాల్సినప్పుడు ఉపయోగించుకునే కేంద్రం పెద్దలు, తమకు అవసరమైనప్పుడు ఉపయోగపడటం లేదన్న ఆగ్రహంతో ఉన్నారు. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు వ్యవహారం బీజేపీకి, వైసీపీకి మధ్య స్నేహం చెడే అవకాశాలు కన్పిస్తున్నాయి.