YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సముద్రంలో వృధాగా నీరు

సముద్రంలో వృధాగా నీరు

విజయవాడ జూలై 5, 
తెలంగాణ ప్రభుత్వం వద్దని చెప్పినా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అది వేరే పంచాయతీ. కానీ అలా దిగువకు వస్తున్న నీళ్లన్నింటినీ ఏపీ సర్కార్.. ప్రకాశం బ్యారేజీ గుండా సముద్రంలోకి పంపేస్తోంది. ఇక్కడే చాలా మందికి ఓ సందేహం వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడం ఆపలేనప్పుడు.. అలా వచ్చిన నీటినైనా రైతులకు పంపిణీ చేయకుండా ముద్రం పాలు ఎందుకు చేస్తున్నారన్నదే ఆ సందేహం. ప్రస్తుతం కృష్ణా డెల్టాలో నారు మళ్ల సీజన్. తూర్పు, పశ్చిమ కాలువ కింద ఉన్న రైతులు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. వారికి నీరు విడుదల చేస్తే నారుమళ్లు రెడీ చేసుకుంటారు. కానీ ప్రభుత్వం అసలాంటి ఆలోచన చేయకుండా నేరుగా సముద్రంలోకి వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి రోజుకు తొమ్మిది వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. ప్రభుత్వం తీరుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అయితే ఈ పాటికి పట్టిసీమ ద్వారా నీరువచ్చి ఉండేది. ఆ నీటితో నారుమళ్లు పోసుకునేవారు. ఈసారి పట్టిసీమ నీరు రాలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూండటంతో దిగువకు నీరు వస్తోంది. వాటినైనా ఇస్తే రైతులు వరి నాట్లు వేసుకుంటారు. కానీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేయడం లేదు. దీనికి కారణం.. రేపు కృష్ణా ట్రిబ్యూనల్‌లో…తాము విద్యుత్ ఉత్పత్తి చేసినా నీరు ఏపీకే వెళ్లిందని..వారు కాల్వలకు మళ్లించుకున్నారని తెలంగాణ సర్కార్ వాదిస్తుందనే అంచనాతో… తెలంగాణ సర్కార్‌ నీటిని వృధా చేసిందని చెప్పడానికే.. సముద్రంలోకి పంపుతున్నారన్న భావన వ్యక్తమవుతోంది. అయితే సముద్రంలోకి పోయే నీరు రైతులకు ఉపయోగపడినంత మాత్రాన.. తెలంగాణ వాడినట్లు ఎందుకు అవదని.. ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించే ప్రయత్నం చేయాలి కానీ.. నీటిని సముద్రంలోకి వదిలేయడం ఏమిటని రైతులు అంటున్నారు. రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతూండటంతో ప్రభుత్వం కూడా.. సముద్రంలోకి పంపే బదులు కాల్వల్లోకి మళ్లించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది. ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే.. రైతులకు అంత మేలు.. లేకపోతే.. ఇబ్బందే.
న్యాయ పోరాటానికి రైతులు
రెచ్చగొడితే రెచ్చిపోబోమని.. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతామని .. కృష్ణాజలాలు సముద్రం పాలవుతున్నా.. నింపాదిగా ఏపీ ప్రభుత్వాన్ని చిటికెన వేలితో నడిపిస్తున్నానని భావించే సలహాదారు సజ్జల చెబుతున్నారు. కానీ ఆయనకు ఉన్నంత ధీమా కృష్ణా డెల్టా రైతులకు లేకుండా పోయింది. నీళ్లన్నీ సముద్రంలోకి పోతే.. తర్వాత కాలేది తమ కడుపేనని అర్థం చేసుకుని న్యాయపోరాటం ప్రారంభించారు. ప్రధానికి లేఖలు రాశామని.. కేంద్రం మధ్యవర్తిత్వం చేస్తోందని.. సజ్జల చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం ఇలాంటి మాటలు నమ్మడం కన్నా.. తమ పోరాటం తాము చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని.. దీనికి సంబంధించిన జీవోను నిలిపివేయాలంటూ.. రైతులు పిటిషన్‌లో కోరారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు రైతులు పక్కా సమాచారం సేకరించారు. ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా జీవో ఇచ్చారని.. ఏదైనా కృష్ణాబోర్డు ఆదేశాల మేరకే జరగాలని… కానీ తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా జీవో ఇచ్చిందని పిటిషన్‌లో తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో పాటు కృష్ణాబోర్డు కూడా విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కోరిందని.. వాటికి సంబంధించిన లేఖలను జత చేశారు. ఎటువంటి ఇరిగేషన్ అవసరం లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకోవటం అన్యాయం అని పిటిషన్ లో ఆంధ్రప్రదేశ్ రైతులు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణలో తెలంగాణ హైకోర్టు ఏం చెబుతుందో కానీ.. రైతులు మాత్రం.. ఏపీ సర్కార్ ను నమ్ముకోవడం కన్నా.. తమ పోరాటం తాము చేయాలని నిర్ణయించుకోవడం.. ఆసక్తిరంగా మారింది. నీళ్లను కాపాడేందుకు ఏపీ సర్కార్ పరంగాఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. వాడుకుంటే వాడుకోనీ అన్నట్లుగా ఉన్నారు. గతంలో.. తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేసినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇతరులు పిటిషన్లు వేస్తే… ఇంప్లీడ్ అయింది. ఇప్పుడు.. రైతుల పిటిషన్‌లో ప్రభుత్వం ఇంప్లీడ్ అవుతుందో.. తమకు సంబధం లేనట్లుగా ఉంటుందో వేచి చూడాలి..!

Related Posts