విజయనగరం
మాన్సస్ ట్రస్ట్ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలో ఉందని, అప్పుడే దానిపై మాట్లాడటం సముచితం కాదని మున్సిపల్ శాఖా మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు.ట్రస్ట్ కార్యకలాపాలకు సంబంధించి ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ట్రస్ట్ పాలకులదేనని,16 ఏళ్లుగా ఆడిట్ ఎందుకు చేయలేదో అశోక్ గజపతిరాజుకే తెలియాలని బదులిచ్చారు.అంతకు ముందు ఒక కోటీ 48 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన విజయనగరం కార్పొరేషన్ కార్యాలయంలో గల మేయర్,డిప్యూటీ మేయర్ పరిపాలన విభాగంకు సంబంధించిన కార్యాలయాలను బొత్సా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అమరావతి భూముల వ్యవహరంలో అక్రమాలు జరగాయన్నది స్పష్టమని, దానిపై విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.మరోవైపు క్రుష్ణా నదీ జలాల వాటా విషయంలో ఏపీ ప్రభుత్వం న్యాయబద్ధంగానే వెళుతోందని,కాని తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఆలోచనలో మార్పు రావడం దురదృష్టకరమని రాష్ట్ర్ర మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. విద్యుత్ ను ఎక్కడ నుంచైనా కొనుక్కోవచ్చుగాని, జలాలను కొనుక్కోలేమన్న విషయాన్ని తెలంగాణ పెద్దలు గుర్తించాలన్నారు. హక్కులతో పాటు మానవతా విలువలను కూడా వారు గుర్తించాలని కోరారు. తమ మంత్రులెప్పుడూ పరుష పదజాలాన్ని వాడకుండా, తమ హక్కుల కోసం అడుగుతున్నామని తెలిపారు. సామరస్యంగా సమస్య పరిష్కరించే విధంగా ఇరు రాష్ట్ర్రాలు వ్యవహరించాలనే ఉద్దేశ్యంతోనే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు చట్టాలు, ట్రిబ్యునల్ ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు.