న్యూఢిల్లీ జూలై 5
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఏ సెక్షన్‌ను 2015వ సంవత్సరంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2000 సంవత్సరంలో రూపొందించిన ఆ చట్టాన్ని ఇంకా కొన్ని కేసుల్లో నమోదు చేస్తున్నారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఐటీ యాక్ట్‌లోని 66ఏ సెక్షన్‌ను ఎప్పుడో రద్దు చేశారని, మరెందుకు ఆ సెక్షన్ ప్రకారం ఇంకా కేసులు నమోదు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఈ పరిణామాలు దారుణంగా ఉన్నాయని సుప్రీం విస్మయాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ రోహింటన్ నారీమన్, కేఎం జోసెఫ్, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌పై విచారణ చేపడుతూ.. రద్దు అయిన ఆ చట్టం గురించి దేశంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లకు తెలియజేయాలని తన తీర్పులో కేంద్రాన్ని ఆదేశించింది. 2015 మార్చి 24వ తేదీన ఓ తీర్పులో ఐటీయాక్ట్‌లోని 66ఏ సెక్షన్‌ను రాజ్యాంగవ్యతిరేకమని కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ చట్టం కింద దేశవ్యాప్తంగా 745 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.