న్యూఢిల్లీ జూలై 5
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన హిందూ-ముస్లిం ఐక్యత వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు.మోహన్ భగవత్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన దిగ్విజయ్ సింగ్ ఆరెస్సెస్ చీఫ్ ప్రవచించిన ఇవే సూక్తులను ఆయన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కార్యకర్లు, మోడీ-షా జోడీతో పాటు బీజేపీ సీఎంలకు సూచించగలరా అని నిలదీశారు. హిందూ-ముస్లింలు వేర్వేరు కాదని, వీరి ఐక్యతపై దుష్ర్పచారం సాగుతోందని ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.గత 40,000 సంవత్సరాలుగా మనం ఒకే వారసుల నుంచి వచ్చినవారమని పేర్కొన్నారు. భారతీయులందరిదీ ఒకే డీఎన్ఏ అన్నారు. ఇక భగవత్ వ్యాఖ్యలను ప్రస్తావించిన దిగ్విజయ్ సింగ్ మోహన్ భగవత్‌జీ తన వ్యాఖ్యలపై నిజాయితీగా వ్యవహరిస్తే అమాయక ముస్లింలను హింసించిన బీజేపీ కార్యకర్తలు నేతలను ఆయా పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యానాధ్‌ల నుంచే ఈ ప్రక్షాళనకు నాంది పలకాలని దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.