హైదరాబాద్ జూలై 5 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య నెలకొన్న నీటి వివాదాల నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డుకు రాష్ర్ట నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ మరో లేఖ రాశారు. ఈ నెల 9న తలపెట్టిన త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా వేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20వ తేదీ తర్వాత పూర్తి స్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జల విద్యుత్ ఉత్పత్తి ఆపాలన్న ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు రజత్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అజెండాను లేఖలో పొందుపరిచారు. తెలంగాణ అంశాలను 20వ తేదీ తర్వాత జరిగే బోర్డు సమావేశం అజెండాలో చేర్చాలని కోరారు.ప్రధానంగా తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాలపై పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు ఆపాలన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా బేసిన్ వెలుపలకు ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటిని తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు లభించడంతో తెలంగాణకు అదనంగా 45 టీఎంసీలు కేటాయించాలని ప్రతిపాదించారు. తాగునీటి జలాలను 20 శాతంగానే లెక్కించాలని చెప్పారు. తెలంగాణ మిగులు జలాల లెక్కింపు వ్యవస్థ ఏర్పాటు చేయాలని రజత్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.