కాకినాడ, జూలై 6
కాకినాడ డీప్ వాటర్ పోర్టులో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ముంబైకి చెందిన హెచ్.ఎనర్జీ సంస్థ అనుబంధ సంస్థ ఈస్ట్‌కోస్ట్ కన్సెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈసీపీఎల్) దీనిని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ రెండు దశల్లో సుమారు రూ.5,400 కోట్ల పెట్టుబడి అంచనాతో భారీ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తొలి దశ పనులు చేపట్టేందుకు ఈసీపీఎల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ నిర్మాణానికి భారీ వ్యయం కానుండటంతో.. టెర్మినల్‌ను దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంటుంది. కాకినాడ డీప్‌వాటర్ పోర్టు (కేఎస్‌పీఎల్)ను 50 ఏళ్లపాటు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేఎస్‌పీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ పైన పదేళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది. అయితే, కేఎస్‌పీఎల్ ఏర్పాటై 23 ఏళ్లు గడిచిపోగా.. ఇక 27 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ఈస్ట్‌కోస్ట్ కన్సెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెనుకంజ వేస్తోంది. కేఎస్‌పీఎల్ కన్సెషన్ సమయం అయినపోయిన తర్వాత కూడా టెర్మినల్ కొనసాగించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు లేదా కన్సెషన్ పీరియడ్ తర్వాత వచ్చే కొత్త ఆపరేటర్‌తో కొనసాగించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ తొలి దశ పనులను చేపట్టడానికి ఈసీపీఎల్ ముందుకొచ్చింది.కాకినాడ డీప్ వాటర్ పోర్టులో తొలి దశలో రూ.1,600 కోట్ల ఎల్‌ఎన్‌జీ టెర్మినల్, రూ.200 కోట్లతో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్స్ నిర్మించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డుకు ఈస్ట్‌కోస్ట్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. రెండో దశలో మరో రూ.3,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కన్సెషన్ అగ్రిమెంట్‌పై స్పష్టత రావడంతో వర్షాకాలం తర్వాత ఈసీపీఎల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని ఏపీ మారిటైమ్ బోర్డు వివరించారు. 5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటు చేస్తుండగా.. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుంది.ఏటా 1 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ సరఫరా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో ఏటా రూ.1,200 కోట్ల ఆదాయంతో పాటు కాకినాడ డీప్ వాటర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటా రూపంలో మరో రూ.100 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ మధ్యనే గంగవరం పోర్టులో అత్యధిక వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూపు కూడా అక్కడ భారీ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు మురళీధరన్ తెలిపారు. ఈ రెండు టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే రాష్ట్ర ఖజానాకు వచ్చే15 ఏళ్లలో వ్యాట్ రూపంలో రూ.50 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు