గుంటూరు, జూలై 6,
అదిగో పులి.. అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఉంది.. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతల పరిస్థితి. త్వరలోనే సీఎం జగన్ మంత్రి వర్గాన్నిప్రక్షాళన చేస్తారనే వార్తలు హల్‌చల్ చేస్తున్న సమయంలో ఇక్కడి నేతలు.. మాకే మంత్రి పదవి వస్తుందంటే మాకే వస్తుందని ఆశలు పెట్టుకోవడంతోపాటు.. పెద్ద ఎత్తున తమ అనుచరులతో ప్రచారం కూడా చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రచారం పీక్ స్టేజ్‌కి వెళ్లిందని అంటున్నారు పరిశీలకులు. గుంటూరు జిల్లాలో వైసీపీకి సీనియర్లు.. జూనియర్ నేతలు చాలా మందే ఉన్నారు. వీరంతా కూడా కేబినెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు.గుంటూరు జిల్లాలోని మాచర్ల నుంచి నాలుగు సార్లు వరుసగా గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా తనకు తగిన గుర్తింపు లభిస్తుందని అనుకుంటున్నారు. రాజధాని రగడ సమయంలో ఆయన కారుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ సింపతి కలిసి వస్తుందని.. తనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇక, సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై విజయం దక్కించుకున్న వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు.. అంబటి రాంబాబు కూడా ఈ క్యూలో ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి.. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తనకు కూడా మంత్రి పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.అదే సమయంలో గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న విడదల రజనీ అయితే.. ఏకంగా .. తనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆమె గతంలోనే కేబినెట్‌లో సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే.. అప్పట్లో ఆమెకు అవకాశం చిక్కలేదు. అయితే.. ఇప్పుడు గ్యారెంటీ అని ఆమె అనుచరులతో ప్రచారం చేయించుకోవడం బ్యానర్లు.. పోస్టర్లు వేసుకోవడం గమనార్హం. బీసీ + మహిళా కోటాలో ఆమె హడావిడి చేస్తున్నారు.అదేవిధంగా ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదు.. కనుక తనకు గ్యారెంటీ అని ప్రచారం చేస్తున్నారు. ఇక, గుంటూరు జిల్లాలో గత ఎన్నికల సమయంలో జగన్ ఆదేశాలతో టికెట్లు త్యాగం చేసి.. పోటీ నుంచి తప్పుకొన్న వారు కూడా మంత్రి వర్గం రేసులో ముందున్నారు. వీరిలో చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజేశేఖర్ కూడా ముందు వరుసలో ఉన్నారు. అదేవిధంగా ఇటీవల ఎమ్మెల్సీ అయిన.. వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన లేళ్ల అప్పిరెడ్డి కూడా మంత్రి వర్గంలో సీటుపై ఆశలు పెట్టుకున్నారు. లేళ్ల అప్పిరెడ్డికి జగన్ దగ్గర ఉన్న పలుకుబడి కూడా బాగానే వర్కవుట్ అవుతుందని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది.ఇవన్నీ ఇలా ఉంటే.. గత ఎన్నికల్లో టీడీపీ నేత, చంద్రబాబు తనయుడు.. లోకేష్‌ను ఘోరంగా ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే.. ఆళ్ల రామకృష్ణా రెడ్డి కూడా ఈ రేసులో ఉన్నారు. ఈయనకు అప్పట్లోనే జగన్ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన కూడా కేబినెట్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి గుంటూరు జిల్లాకు గతంలో ఇద్దరికి మాత్రమే జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. ఒకరు సుచరిత కాగా, మరొకరు మోపిదేవి వెంకట రమణ. ఈయనను రాజ్యసభ కు పంపించారు. దీంతో ఈ పదవి ఖాళీఅయింది. ఎలా చూసుకున్నా ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది. కానీ, పది మంది వరకు పోటీ పడుతుండడం గమనార్హం. మరి ఎవరికి దక్కుతుందో చూడాలి.