తిరుపతి, జూలై 6,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024 ఎన్నికలకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈసారి తాను ఒకచోట నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక క్లారిటీకి వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో మాదిరిగా రెండు చోట్ల పోటీ చేసే ఆలోచనను ఆయన విరమించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆయన ఈసారి తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.2019 ఎన్నికల్లో తొలిసారి పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. తాను కమ్యునిస్టులు, బీఎస్పీలతో కలసి పోటీ చేశారు. ఒకరకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసినట్లు భావించాల్సి ఉంటుంది. కమ్యునిస్టులు, బీఎస్పీకి పెద్దగా బలం లేకపోవడంతో పవన్ కల్యాణ్ తన సొంత బలంతోనే బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెడతారని అందరూ భావించారు.పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, విశాఖలోని గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేశారు. అయితే జగన్ ప్రభంజనంతో పోటీ చేసిన రెండు స్థానాల నుంచి పవన్ కల్యాణ్ ఓటమి పాలయ్యారు. ఇది పవన్ కల్యాణ్ సయితం ఊహించినది. ఓటమికి గల కారణాలను పవన్ కల్యాణ్ విశ్లేషిస్తే.. అక్కడ కార్యకర్తలు బలంగా ఉన్నా ఓట్లు మాత్రం తనకు అనుకూలంగా పడలేదని తేలింది. దీనికి తోడు రెండు చోట్ల అక్కడ గెలుస్తారు అన్న ధీమాతో నిర్లక్ష్యం వహించడం కూడా ఒక కారణం. అయితే ఈసారి తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.
గతంలో మాదిరిగా రెండుస్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలు కాకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన తిరుపతిని ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. తిరుపతిలో వైసీపీ వీక్ గా ఉంది. టీడీపీ కూడా అనుకున్నంత బలంగా లేదు. ఈ పరిస్థితుల్లో తాను జనసేన నుంచి బరిలోకి దిగితే విజయం ఖాయమని పవన్ కల్యాణ‌్ భావిస్తున్నారని తెలిసింది. అందుకే ఆయన తిరుపతిని ఎంచుకున్నారు. కరోనా తీవ్రత తగ్గగానే ఆయన తొలి పర్యటన తిరుపతి ఉండనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తిరుపతి స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.