న్యూఢిల్లీ, జూలై 6,
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం నాడు తన క్యాబినెట్‌ను విస్తరించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు మోదీ 2.0 ప్రభుత్వంలో తొలిసారి క్యాబినెట్ విస్తరణ కానున్నది. ప్రస్తుతం 28 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.దీని ప్రకారం 17-22 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాబినెట్ విస్తరణపై రెండు రోజులుగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో చర్చలు జరుపుతున్నారు.క్యాబినెట్ విస్తరణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌తోపాటు బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లభిస్తుందని తెలుస్తున్నది.
మధ్యప్రదేశ్ నుంచి సింధియాకు చోటు
మధ్యప్రదేశ్‌లో తిరిగి బీజేపీ ప్రభుత్వం కొలువు దీరడంలో కీలక భూమిక వహించిన యువనేత జ్యోతిరాదిత్య సింధియా, జబల్పూర్ ఎంపీ రాకేశ్ సింగ్ లకు చోటు దక్కవచ్చు. మరో ఇద్దరు నేతలకు కూడా మధ్యప్రదేశ్ నుంచి చాన్స్ లభిస్తుందని తెలుస్తున్నది.
బీహార్‌లో ఎల్జేపీ నేత పశుపతి కుమార్ పరాస్
బీహార్‌లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) ఎంపీ పశుపతి కుమార్ పరాస్, జేడీయూ నేత ఆర్సీపీ సింగ్‌లు మంత్రులుగా ప్రమాణం చేయొచ్చు. ఈ రాష్ట్రం నుంచే ఇద్దరు లేదా ముగ్గురు నేతలకు చోటు దక్కుతుందని చర్చలు జరుగుతున్నాయి.
యూపీలో మళ్లీ అనుప్రియా పటేల్‌కు చోటు
ఉత్తరప్రదేశ్‌లోని అప్నాదళ్ అధినేత అనుప్రియా పటేల్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ఆమె గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకున్నారు. ఇక వరుణ్‌గాంధీ, రాంశంకర్ కథేరియా, అనిల్ జైన్, రీటా బహుగుణ జోషి, జాఫర్ ఇస్లాం పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో నలుగురి పేర్లపై ప్రస్తావన
ఇక మహారాష్ట్రలోని బీజేపీ ఎంపీ హీనా గావిట్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. వీరితోపాటు భూపేంద్ర యాదవ్, పూనం మహాజన్, ప్రీతం ముండే పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి.
ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ డిప్యూటీ సీఎంనూ మోదీ తన క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీరత్ సింగ్ రావత్, అసోం మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణె కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ ఈ నెల మూడో తేదీనే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ కూడా క్యాబినెట్‌లో బెర్త్ లభించే అవకాశం ఉంది.వీరితోపాటు బీజేపీ ఎంపీలు జామ్యాంగ్ నాంగ్యాల్ (లడఖ్), అజయ్ భట్ లేదా అనిల్ బాలూనీ (ఉత్తరాఖండ్), ప్రతాప్ సిన్హా (కర్ణాటక), జగన్నాథ్ సర్కార్ (పశ్చిమ బెంగాల్), శంతను ఠాకూర్ లేదా నితీష్ ప్రమాణిక్, బ్రిజేంద్ర సింగ్ (హర్యానా) పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇంకా బీజేపీ ఎంపీలు రాహుల్ కాస్వాన్ (రాజస్థాన్), అశ్విని వైష్ణవ్ (ఒడిశా), పర్వేశ్ వర్మ లేదా మీనాక్షి లేఖి (ఢిల్లీ) పేర్లను క్యాబినెట్‌లోకి తీసుకునే విషయమై అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు వినికిడి.ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి మోదీ క్యాబినెట్‌లో నలుగురు మంత్రులు ఉన్నారు. నరేంద్ర సింగ్ తోమర్, థావర్ చంద్ గెహ్లాట్, ఫగన్ సింగ్ కులస్తే, ప్రహ్లాద్ పటేల్ మంత్రులుగా ఉన్నారు.వీరిలో థావర్ చంద్ గెహ్లాట్, ఫగన్ సింగ్ కులస్తేల్లో ఒకరిని సాగనంపుతారని తెలుస్తున్నది. 2014లో మోదీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి థావర్ చంద్ గెహ్లాట్ మంత్రిగా ఉన్నారు.