హైదరాబాద్, జూలై 6,
కోవిడ్ కారణంగా ఏడాదిన్నరగా ముందుకు సాగని ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పుడు పరిస్థితులు అనుకూలించినా ధరలు పెరిగిపోవడంతో ఆగిపోవడమో లేక నత్తనడకన సాగడమో జరుగుతోంది. సిమెంట్, ఇసుక, స్టీల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆ రేట్లతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం బిల్డర్లకు తలకు మించిన భారంగా పరిణమించింది. పాత రేట్లకు పనులు పూర్తి చేయలేమంటూ కాంట్రాక్టర్లు, ఒప్పందం మేరకు కట్టాల్సిందేనంటూ యజమానులు ఎవరి వాదనను వారు వినిపిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి పునాదుల నుంచి పైకప్పు వరకు ఏ వస్తువు కొన్నా 20% నుంచి 30% వరకు ధరలు పెరిగాయి. గతంలో స్టీల్ టన్నుకు రూ.4,0000 నుంచి 5,0000 మధ్యలో ఉండేది. ఇప్పుడు అదే రూ. 55000 నుంచి రూ. 60వేలకు వెళ్లిపోయింది. గతంలో ఒక్క ఇటుక రూ.6 నుంచి రూ.7 ఉండేది. అదే ఇప్పుడు రూ.8 నుంచి 10కి పెరిగిపోయింది. గతంలో ఇసుక టన్ను రూ.1,200 నుంచి 1,600 వరకు ఉండేది. అదే ఇప్పుడు టన్ను ధర రూ. 2000 నుంచి 2,500 వరకు అమ్ముతున్నారు.వర్షాకాలం మొదలు కాకముందే ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. ఇంకా వర్షాలు కురిస్తే మాత్రం రూ.3 వేల నుంచి రూ.3,500 దాటే అవకాశం లేకపోలేదు. వీటితోపాటు కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. దీంతో ఇంటి నిర్మాణం కోసం లాక్‌డౌన్‌కు ముందు చేసుకున్న అగ్రిమెంట్లతో ఇప్పుడు ఇంటి యజమాని –బిల్డర్స్ తలపట్టుకుంటున్నారు.లాక్‌డౌన్‌తో భవన నిర్మాణ వస్తువుల ఉత్పత్తి ఆగిపోవడం, సామగ్రి తయారీ లేకపోవడంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.