న్యూఢిల్లీ, జూలై 6,
కోవిడ్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది కూడా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుడి రథయాత్రను ఆంక్షల నడుమ నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జులై 12న జరిగే రథయాత్రను కేవలం పూరీకి పరిమితం చేయగా. ఒడిశా ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై కేంద్రం సహా పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. రథయాత్రపై ఒడిశా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.పూరీతో పాటు కేంద్రపడ, బార్ఘర్ జిల్లాల్లోనూ రథయాత్రను నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఒడిశా హైకోర్టులో కొందరు భక్తులు పిటిషన్లు వేశారు. వాటిని కొట్టివేసిన హైకోర్టు.. ఒడిశా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. కేంద్ర ప్రభుత్వం కూడా ఒడిశా నిర్ణయాన్ని సవాల్ చేసింది. ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. వాటని కొట్టేసింది.వచ్చేసారైనా ఆ దేవుడే రథయాత్రకు అనుమతిస్తాడని ఆశిద్దాం. అంతా ఆ దేవుడి దయ’’ అని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ‘‘నేను కూడా ఏటా పూరీకి వెళ్తాను. కానీ, ఏడాదిన్నరగా సాధ్యంకాలేదు. ఇంట్లోనే పూజలు చేస్తున్నాను.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఉండి కూడా దేవుడిని పూజించొచ్చు. రథయాత్ర విషయంలో ఒడిశా ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంది’’ అని అన్నారు.వాస్తవానికి గతేడాది కేవలం పూరీలోనే రథయాత్ర నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కేవలం 500 మందితోనే రథయాత్రను నిర్వహించాలని, వీరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలంది. అంతేకాదు రథయాత్ర సమయంలో కర్ఫ్యూ విధించాలని సూచించింది. కానీ, సుప్రీంకోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. రథయాత్ర కోసం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది రథయాత్రకు భక్తులను అనుమతించేది లేదని ఒడిశా తెగేసి చెప్పింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వివిధ సూచనలు చేసింది.రథయాత్రకు భక్తులను అనుమతిస్తే భారీ జనసందోహాలను నియంత్రించడం అసాధ్యమని పేర్కొంది. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలు అమలు కష్టసాధ్యమని వివరించింది. ఇందుకు గతేడాది జరిగిన సంఘటనను ఉదాహరణగా చెప్పింది. పూరీలో జరిగే రథయాత్రకు ప్రపంచ నలు మూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు.