విశాఖపట్టణం, జూలై 7,
పాలనా రాజధానిని విశాఖకు తరలించే ఆలోచనపై సర్కారే సందిగ్ధంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏడాదిగా నలుగుతున్న తరలింపు వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఉన్నతస్థాయి అధికారులు అంటున్నారు. ముందుగా ముఖ్యమంత్రి విశాఖకు వెళ్లిపోతారని, తరువాత దశలవారీగా శాఖాధిపతులు, ఆ తరువాత సచివాలయం వెళ్తుందని మంత్రులు, సలహాదారులు చెబుతున్నప్పటికీ ఇప్పట్లో ఆ విషయం ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదని సమాచారం. ప్రధానంగా విశాఖలో రాజధాని ఏర్పాటు చేయాలంటే సచివాలయానికు పాతిక నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండే భవన సముదాయం అవసరమని అధికారులు అంటున్నారు. వందకు పైగా ఉన్న శాఖాధిపతుల కార్యాలయాలకు కూడా భవనాలను సమకూర్చాల్సి ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో భవనాలు సమకూర్చాలంటే అంత సులువుగా జరిగే పనికాదని సాధారణ పరిపాలనశాఖ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఇప్పట్లో సొంత భవనాలు సమకూర్చుకోవడం సాధ్యం కాని నేపథ్యంలో అద్దెకు భవనాలను సమకూర్చుకోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే, ఇది భారీ వ్యయంతో కూడుకున్నదని చెబుతున్నారు. ఆర్ధికశాఖ కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సొంత భవనాల నిర్మాణం కూడా అసాధ్యమని వారు అంటున్నారు. విజయవాడ, గుంటూరులో తీసుకున్న మాదిరిగా విశాఖలో అద్దెకు భవనాలు తీసుకునే ఆలోచన చేసినప్పటికీ, ప్రస్తుత రాజధానిలో ఉన్న భవనాలను పూర్తిగా ఖాళీ చేస్తేనే ఆ అద్దె సొమ్మును విశాఖలో ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయని, అయితే విజయవాడ, గుంటూరుల్లో అద్దె భవనాలను ఆయా శాఖల అధికారులు వెంటనే ఖాళీ చేస్తారా అన్నది ప్రశ్నగానే కనిపిస్తోందని ఆర్ధికశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి ఐదేళ్లు దాటిపోయినప్పటికీ ఇంకా కొన్ని భవనాలకు హైదరాబాద్‌లో అద్దె చెల్లించాల్సి వస్తోందని, అఖిలభారత సర్వీసు అధికారులు కూడా హైదరాబాద్, అమరావతిల్లో రెండేసి గృహాలు ఉంచుకోవడం వల్ల రెండు అద్దెలు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. కోర్టు కేసులు, కరోనా వ్యాప్తి కూడా తరలింపునకు పెద్ద అడ్డంకిగానే కొందరు అధికారులు విశ్లేషిస్తున్నారు. అమరావతి రైతులు వేసిన అనేక కేసులు ఉన్నత న్యాయస్థానాల్లో విచారణలోనే ఉన్నాయి. ఇవి పరిష్కారం కాకుండా తరలింపు సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రైతులు, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక గత ఏడాది మార్చి నుంచి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కరోనా కూడా తరలింపునకు అడ్డుగానే భావిస్తున్నారు. ఈ సమయంలో వేల మందిని తరలించడం వైద్యపరంగా మంచిది కాదన్న అభిప్రాయాన్ని వైద్య శాఖ కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అన్నీ సద్దుమణిగితే తరలింపు పూర్తి చేసేందుకు మరో ఏడాది పడుతుందని సీనియర్ అధికారులు కొందరు అంటున్నారు.