విజయవాడ, జూలై 7,
ఏపీ సీఎం జగన్ దూకుడుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్రేకులు వేస్తుందా ? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. సంచలన నిర్ణయాల దిశగా ముందుకు సాగుతుందా? ఇవీ గడిచిన కొద్ది రోజులుగా మరీ ముఖ్యంగా సీఎం జగన్ ఢిల్లీ టూర్ తర్వాత.. రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవానికి గురి కావడం. రెండు వచ్చే ఎన్నికల్లో పుంజుకునే విషయంపై సందేహాలు వ్యక్తం అవుతుండడం. దీంతో రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై కేంద్రంలోని పెద్దలు.. జోక్యం చేసుకుంటున్నారని రాజకీయ నేతలు భావిస్తున్నారు.రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారానికి వచ్చే సరికి.. జగన్ దూకుడుకు కళ్లెం వేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ పుంజుకునే పరిస్థితిలో లేదని.. కానీ, జగన్ దూకుడుకు కొంతమేరకు అడ్డుకట్టపడితే.. పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక, మరోవైపు.. రాజకీయంగా తమకు అనుకూల వాతావరణం ఏర్పడాలంటే.. వైసీపీకి అడ్డంకులు ఏర్పడాలనే ఆలోచన కూడా కనిపిస్తోంది. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకునేందుకు.. అక్కడి గవర్నర్‌లు దోహదపడ్డారనే వాదన ఉంది. బెంగాల్‌లో 4 నుంచి 74 సీట్లు దక్కించుకోవడం వెనుక.. రాజకీయ నేతలతోపాటు ప్రథమ పౌరుడు కూడా ప్రధానంగా ఉపయోగపడ్డారనే రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.ఇక, ఢిల్లీ, పుదుచ్చేరి సహా.. ఇతర బీజేపీ యేతర రాష్ట్రాల్లో గవర్నర్‌ల దూకుడు కారణంగానే బీజేపీ ఒకింత బలపడిందని.. అక్కడి ప్రభుత్వాలను ఇరుకున పెట్టడం ద్వారా నిత్యం వార్తల్లో నిలిచిన గవర్నర్లు కూడా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలోనూ గవర్నర్.. ఏకంగా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించడం కొన్నాళ్ల కిందట వివాదాస్పదం అయింది. అయితే.. ఏపీలో మాత్రం గవర్నర్‌కు, సీఎంకు మధ్య మంచి రెపో కొనసాగుతోందనే చర్చ జరుగుతోంది.దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఏంచేసినా.. ప్రయోజనం ఉండడం లేదనేది బీజేపీ నేతల మాట. ఈ క్రమంలోనే ఇప్పుడు వారంతా కూడా కేంద్రంలోని మోడీ సర్కారు నిర్ణయంపైనే ఆశలు పెట్టుకున్నారు. జగన్‌కు అడ్డుకట్ట వేయాలంటే..కేంద్రం చేతుల్లోనే ఉందని.. అది ఏ రూపంలో అయినా కావొచ్చని నాయకులు భావిస్తుండడం గమనార్హం. మరి మోడీ ఏం చేస్తారో చూడాలి.