విజయవాడ, జూలై 7,
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆవేదన ఏంటి? రాజకీయంగా వైసీపీపై పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఎందుకు వెనుకబడి పోతోంది ? అంటే.. కేవలం రెండేళ్ల కాలంలో సీఎం జగన్ లక్ష కోట్ల రూపాయల మేరకు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల రూపంలో పంచడమే అంటున్నారు పరిశీలకులు. గత రెండేళ్ల కాలంలో వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.1,00,116.35 కోట్లను అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసి రికార్డు సృష్టించింది. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు 6,53,12,534 ప్రయోజనాలను పొందారు.రెండేళ్ల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అర్హులైన పేదల బ్యాంకు ఖాతాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. లక్ష కోట్ల రూపాయలకు పైగా నగదు బదిలీ చేయడమే కాకుండా.. ఎక్కడా ఒక్కరూపాయి అవినీతి లేకుండా ముందుకు సాగడం.. ఆయా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం వంటివి ప్రభుత్వానికి మంచి మార్కులు వేసేలా చేశాయి. అదే సమయంలో కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హత ప్రమాణికంగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ జరిగింది. ఇదే ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ప్రధాన ఇబ్బందిగా మారింది.నిజానికి చంద్రబాబు హయాంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం పేరిట.. ఆయన నిధులు ప్రజలకు పంచింది లేదు. ఒకవేళ పంచినా.. సరిగ్గా ఎన్నికలకు ముందు అమలు చేసిన పసుపు-కుంకుమ ఒక్కటే కనిపిస్తోంది. అది కూడా ఒకేసారి ఇచ్చింది కాదు. మూడు విడతలుగా ఇచ్చారు. ఇక 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబును అధికారంలోకి తీసుకువచ్చిన రైతు రుణ మాఫీ అట్టర్ ప్లాప్ అయ్యి.. చంద్రబాబుకు గత ఎన్నికల్లో పెద్ద దెబ్బే అయ్యింది. ఇలా బాబు మాట ఇచ్చి చేయలేదన్న కారణాలతో టీడీపీపై విశ్వాసం సన్నగిల్లింది. దీనిని మళ్లీ రాబట్టుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత ప్రయత్నం చేస్తున్నా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సంక్షేమ కార్యక్రమాల్లోనూ లోపాలు ఎత్తి చూపించే ప్రయత్నం చేసింది.అయితే.. ఈ ప్రయత్నం కూడా మార్కులు రాబట్టలేకపోయింది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు.. వ్యూహం మార్చి.. వ్యక్తిగత ఇమేజ్‌ను మరోసారి ఇబ్బందిలోకి నెట్టేలా.. జగన్‌పై వ్యవహారాలు నడిపిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో జగన్ పాలన వేస్ట్ అని అనిపించేలా ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నారు. దీంతో టీడీపీ అనుకూల మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. సో.. ఇలా లక్ష కోట్ల రూపాయల సంక్షేమం టీడీపీని భయపెడుతోందని అంటున్నారు. మరి ఈ భయం పోయేవరకు ఇలానే చేస్తారో.. లేక పంథా మార్చుకుంటారో చూడాలి.