విశాఖపట్టణం, జూలై 7,
గోవా బీచ్ కి టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ స్వేచ్చగా ఎంజాయ్ చేస్తారు. దానికి కావాల్సిన పరిస్థితులు అన్నీ అక్కడ ఉంటాయి. గోవాకు మొత్తం ఆదాయం అంతా టూరిజం నుంచే వస్తోంది. ఇపుడు ఏపీ సర్కార్ కూడా అలాగే ఆలోచిస్తోంది. విశాఖ నుంచి భోగాపురం దాకా ఉన్న యాభై కిలోమీటర్ల బీచ్ ప్రాంతాన్ని అంతా గోవా మాదిరిగా అభివృద్ధి చేయాలని సంకల్పిస్తోంది. ఇందుకోసం కార్యాచరణను కూడా రెడీ చేసి పెట్టుకుంది. విశాఖ బీచ్ కారిడార్ కార్పోరేషన్ ని కూడా ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తోంది.ఇన్నాళ్ళూ విశాఖ బీచ్ కి పర్యాటకులు వస్తే కెరటాలు చూస్తూ కూర్చోవడమే టైమ్ పాస్ గా ఉండేది. ఇపుడు అలా కాదు ఆనందానికి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చబోతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్ టూరిజం డెవలప్మెంట్ తో పాటు, కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యేలా ప్రాజెక్టులను డిజైన్ చేయనుంది. ఇక వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చనుంది. ఈ కార్పోరేషన్ ద్వారానే రానున్న రోజుల్లో బీచ్ కారిడార్ మొత్తం పనులు సాగుతాయని చెబుతున్నారు.ప్రతీ ఏటా విశాఖకు వచ్చే టూరిస్టులు ఎక్కువగానే ఉంటారు. వారి సంఖ్యను ఇంకా పెంచుకోవాలంటే బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు. అందుకోసం గోల్ఫ్ కోర్టులు, ఎమ్యూజ్మెంట్ పార్కులు, రిసార్టులు, ఫ్లోటింగ్ షిప్ రెస్టారెంట్ వంటివి కూడా ఏర్పాటు చేస్తారని అంటున్నారు. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే బీచ్ రోడ్ కారిడార్ లో తొమ్మిది బీచ్ లు వస్తాయని మంత్రి అవంతి శ్రీనివాసరావు చెబుతున్నారు. ఎటు వైపు వెళ్ళినా కూడా టూరిస్టులకు పూర్తి సదుపాయాలు ఉండేలా డిజైన్ చేస్తామని చెబుతున్నారు.నాడు చంద్రబాబు కూడా విశాఖ బీచ్ మీద కన్నేశారు. ఆయన బికినీ ఫెస్టివల్ బీచ్ లో నిర్వహించాలని చూశారు. అయితే విపక్షాలు అడ్డుకోవడంతో అది ఆగింది. ఇపుడు జగన్ సర్కార్ దానిని మించి అన్నట్లుగా అన్ని రకాల వినోదాల విన్యాసాలు తీసుకు వస్తుంది అంటున్నారు. ఒక విధంగా విదేశీ టూరిస్టులకు ఆకట్టుకునే విధంగా ఇక్కడ ప్రాజెక్టులు ఉంటాయని అంటున్నారు. ఇందుకోసం 1021 కోట్ల రూపాయలతో 570 ఎకరాలలో బీచ్ కారిడార్ డెవలపమెంట్ కార్పోరేషన్ అనేక కార్యక్రమాలు చేపట్టనుంది. విశాఖ రాజధాని కాక ముందే అభివృద్ధిని పెద్ద పీట వేస్తున్నామని, రానున్న రోజుల్లో విశాఖ సహా మూడు జిల్లాల రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు