YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి పరిశ్రమలు ఎప్పుడు

ఏపీకి పరిశ్రమలు ఎప్పుడు

విజయవాడ, జూలై 7, 
జగన్ రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఏమి చేసేవారు అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. దానికి సమాధానం కూడా ఉంది. జగన్ కచ్చితంగా పారిశ్రామికవేత్తగా స్థిరపడతారు అని చెబుతారు. నిజానికి వైఎస్సార్ కి తన వారసులను రాజకీయాల్లోకి తేవాలన్న కోరిక ఏదీ లేదు. ఆయనే కాంగ్రెస్ రాజకీయాలతో విసిగిపోయారు. వర్గ పోరు మూలంగా చేతికి అందాల్సిన సీఎం పదవి ముప్పయ్యేళ్ళు ఆలస్యంగా దక్కింది. దాంతో తనతోనే కుటుంబంలో రాజకీయాలు స్వస్తి అనే ఆయన అనుకున్నారని చెబుతారు. కానీ జగన్ వత్తిడి మేరకే ఆయన 2009 ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించారు. అలా అడుగుపెట్టిన జగన్ తండ్రి మరణాంతరం నేరుగా డైరెక్ట్ పాలిటిక్స్ లోకి రావాల్సి వచ్చింది. అలా ఆయన సీఎం అయిపోయారు.జగన్ సీఎం అయితే ఏపీ దశ, దిశ మారుతుందని చాలా మంది ఊహించారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. స్వతహాగా జగన్ మంచి పారిశ్రామికవేత్త. ఆయన ఈ రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే దేశంలోని అగ్ర పారిశ్రామికవేత్తలలో ఒకరుగా ఉండేవారు అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. అలాంటి జగన్ తాను సీఎం గా ఉండగా ఏపీకి పారిశ్రామిక కళ రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయమే. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ యువ నాయకుడు. పారిశ్రామికవేత్తలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనకు పారిశ్రామిక రంగం గురించి సంపూర్ణ అవగాహన ఉంది. మరి అటువంటి జగన్ రెండేళ్ల ఏలుబడిలో ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడం నిజంగా మచ్చగానే చూడాలేమో.జగన్ తన దృష్టికి ఒక వైపే పెట్టేశారు. ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయటకు రావడంలేదు. సంక్షేమ‌ క్యాలెండర్ ని ఆయన తుచ తప్పకుండా అమలు చేస్తున్నారు. ఆ విషయంలో ఆయన శ్రద్ధాసక్తులను మెచ్చుకుని తీరాల్సిందే. కానీ అదే సమయంలో ఏపీ అభివృద్ధి మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. బాధ్యత కలిగిన సీఎం గా ఆయన రెండవ వైపు కూడా చూడాలి కదా అన్న మాట ఉంది. జగన్ తన పరిచయాలను బయటకు తీసి ఏపీలో పరిశ్రమలు పెట్టించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న మాట అయితే ఉంది. ఇక పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ రెడ్డి కూడా సమర్ధుడే. కానీ ఎందుకో వైసీపీ సర్కార్ కి సరైన పారిశ్రామిక విధానం లేదు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. తాజాగా చిత్తూరు జిల్లా నుంచి రియలెన్స్ కంపెనీ బయటకు వెళ్ళిపోవడంతో జగన్ సర్కార్ కి అతి పెద్ద దెబ్బ పడినట్లు అయింది.జగన్ ముందు మూడు రాజధానుల చిక్కు ముడి విప్పాలని చూస్తున్నారుట. విశాఖను పాల‌నా రాజధాని చేసుకుంటే ఆటోమేటిక్ గా పరిశ్రమలు పెట్టేవారు వస్తారని ఆయన అంచనా వేసుకుంటున్నారుట. నిజమే హైదరాబాద్ కి కూడా లేని అదనపు సదుపాయాలు విశాఖకు ఉన్నాయి. దాన్ని రాజధాని అంటే కచ్చితంగా పెట్టుబడులు వస్తాయి. చంద్రబాబు టైమ్ లో కూడా విశాఖలోనే పెట్టుబడులు పెడతామని పలువురు ప్రతిపాదించారని, ఆయన అమరావతి అనడంతోనే వారు వెనక్కి మళ్ళారని చెబుతారు. మరి జగన్ విశాఖ విజన్ తో ముందుకు వెళ్తున్నారు. కానీ ఇప్పటికే పుణ్య కాలం గడిచింది. రాజధాని అన్నది న్యాయ సమీక్ష లో ఉంది. దాంతో అంతవరకూ ఆగకుండా జగన్ ఏపీలో పెట్టుబడులను ఆకట్టుకునేలా గట్టిగా కృషి చేయాలని అంటున్నారు. అదే సమయంలో పరిశ్రమ మంత్రి అయినా విదేశీ పర్యటలను చేసి ఏపీ వైపుగా వారు చూసేలా చర్యలు చేపట్టాలని సూచనలు అందుతున్నారు. మొత్తం మీద జగన్ మదిలో ఏముందో కానీ టీడీపీకి ఈ విషయంలో అడ్డంగా దొరికేస్తున్నారు అన్నది మాత్రం నిజం.

Related Posts