విజయవాడ, జూలై 7,
మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఎన్నికల కమిషన్ కూడా ఉప ఎన్నికల తేదీలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. దేశంలో కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడుతుండటంతో త్వరలోనే నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమయింది. తెలంగాణాలో హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో బద్వేలు నియోజకవర్గాలకు సెప్టంబరు నెలలో ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది.హుజూరాబాద్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యత్నిస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన పోటీ దారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి 30 వేల ఓట్ల తేడాతో ఈటల రాజేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు.మరోసారి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి విజయం సాధిస్తానని చెబుతున్నారు. అయితే ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో బీజేపీయే ఇక్కడ ప్రధాన పోటీదారుగా నిలిచింది. అధికార పార్టీ అభ్యర్థి ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ ఈటలకు దీటైన అభ్యర్థిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని పార్టీలూ హుజూరాబాద్ లో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయిఇక ఆంధ్రప్రదేశ్ లోని బద్వేలు నియోజకవర్గంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ ఎన్నికలో వెంకటసుబ్బయ్య సతీమణిని వైసీపీ అభ్యర్థిగా ఇప్పటికే జగన్ ప్రకటించారు. టీడీపీ పోటీకి దింపాలా? లేదా? అన్న డైలామాలో ఉంది. బీజేపీ మాత్రం తమ అభ్యర్థి బరిలో ఉంటానని ప్రకటించింది. దీంతో బద్వేలు లో ఉప ఎన్నిక వైసీపీకే అడ్వాంటేజీ అని ఎన్నికలకు ముందే అర్థం అవుతుంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబరు లో ఉప ఎన్నికల హడావిడి ఉంటుంది.