YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

దిలీప్ కుమార్ మృతి

దిలీప్ కుమార్ మృతి

ముంబై, జూలై 7, 
బాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం ఉదయం ఆయన కన్నుమూశారు. దిగ్గజ నటుడి మరణ వార్తతో బాలీవుడ్ సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో.. గత వారం ముంబైలోని హిందుజా హస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ప్లూరల్ ఎఫ్యూషన్‏తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇందుకోసం కొన్ని రోజులుగా ఐసియూలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు (బుధవారం) ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేస్తున్నారు.1944లో తెరకెక్కిన ‘జ్వార్‌భాత’ సినిమాతో వెండితెరపై కాలుమోపిన దిలీప్ కుమార్ ఎన్నో సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు గడించారు. 1998లో విడుదలైన ‘ఖిల్లా’ మూవీ తర్వాత ఆయన తన సినీ కెరీర్‌కి గుడ్ బై చెప్పారు. 1960లో కే.ఆసిఫ్ నిర్మించిన 'మొఘల్ ఎ ఆజం' ఆయన జీవితంలో ఓ కీర్తి పతాకం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సత్తా చాటి పలు అవార్డ్స్ అందుకున్నారు దిలీప్ కుమార్.
ఓ శకం ముగిసింది
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (98) ఈ రోజు (బుధవారం) ఉదయం కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు సినీ లోకాన్ని ఏలిన ఆయన, ట్రాజెడీ కింగ్‌గా పేరు ప్రఖ్యాతలు గడించారు. దిలీప్ కుమార్ మరణ వార్తతో సినీ లోకంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ట్వట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలుపుతూ.. దిలీప్ కుమార్ మరణం మన సాంస్కృతిక జగత్తుకు తీరని లోటని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో లెజెండ్‌గా దిలీప్‌కుమార్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతారని, ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. భారత సినీ రంగానికి దిలీప్ కుమార్ చేసిన సేవలను ముందు తరాలు కూడా గుర్తుంచుకుంటాయని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దిలీప్ కుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ ట్వీట్స్ చేశారు.దిలీప్ కుమార్ ఇకలేరని తెలిసి బాలీవుడ్ సహా టాలీవుడ్ నటీనటులంతా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ''భారతదేశం గర్వించదగిన నటుల్లో ఒకరైన దిలీప్‌కుమార్‌ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. కొన్నేళ్లపాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్‌ మృతి బాధకరం. ఆయన మరణంతో ఒక శకం ముగిసింది. దిలీప్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అన్నారు.

Related Posts