కేంద్ర క్యాబినెట్ విస్తరణకు కొన్ని గంటల ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. కాసేపటిక్రితం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ రాజీనామా చేశారు. కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఆరోగ్యశాఖ విఫలమైనట్లు విమర్శలు వచ్చాయి. ఏప్రిల్-మే నెలలో కోవిడ్ మహమ్మారి విజృంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ సరైన రీతిలో స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారతీయ ఆరోగ్య వ్యవస్థపై పెను భారం పడినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. వేలాది మంది బెడ్లు, ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి హర్షవర్దన్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇక క్యాబినెట్‌కు గుడ్‌బై చెప్పిన వారిలో ఇంకా పలువురు మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, సంతోష్ గాంగ్వర్, సహాయ మంత్రులు రావ్ సాహెబ్ ధాన్వే పాటిల్, విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ దోత్రేలు ఉన్నారు. బాబుల్ సుప్రియో కూడా రాజీనామా చేశారు. మొత్తం రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య 11కు చేరుకున్నది.