విజయవాడ, జూలై 8
వంగవీటి మోహన రంగా అన్న పేరు వింటేనే వైబ్రేషన్స్ వస్తాయి. ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నాడు బలంగా ఉన్న ఎన్టీఆర్ సర్కార్ ని కూలదోయడం వెనక రంగా పోరాటంతో పాటు ఆయన బలిదానం కూడా ఉంది. అటువంటి రంగా వారసత్వం రాజకీయాల్లో గట్టిగా లేకపోవడం విషాదమే. రంగాను నమ్ముకుని వచ్చిన వారు పెద్ద నాయకులు అయ్యారు. కానీ రంగా కుమారుడు వంగవీటి రాధాక్రిష్ణ మాత్రం ఎటూ కాకుండా పోయారు. ఆయన కాంగ్రెస్ తరఫున 2004లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తరువాత ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీలో చేరినా ఆయనకు మళ్ళీ చాన్స్ దక్కలేదు. ఇదిలా ఉంటే వంగవీటి రాధ వైసీపీలో చేరాలని గట్టిగానే నిర్ణయించుకున్నారుట. వచ్చే ఎన్నికలలో పోటీ చేసి గెలవాలంటే వైసీపీయే తనకు సరైన వేదిక అని భావిస్తున్నారుట. వైసీపీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన వంగవీటి రాధాను 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయమని జగన్ కోరారు. దాంతో ఆయన అలిగి వైసీపీలో ఉండకుండా టీడీపీలో చేరారు. టీడీపీకి ఆయన మద్దతు ఇచ్చినా కూడా ఆ పార్టీ ఓడింది. వంగవీటి రాధాకు కూడా ఏ మాత్రం అక్కడ రాజకీయ లాభం కలగలేదు. పైగా ఇపుడు విజయవాడలో టీడీపీ గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది. దాంతో రాధాకృష్ణ జగన్ కి జై అంటున్నారుట. గోదావరి జిల్లాలకు చెందిన తోట త్రిమూర్తులకు జగన్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. దాంతో పాటు జగన్ వద్ద ఆయనకు పరపతి పెరిగింది. త్రిమూర్తులుకు కాపుల్లో ఉన్న బలాన్ని చూసే జగన్ ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి కాపులను సంఘటితం చేసి వైసీపీకి అనుకూలంగా చేసే బాధ్యతను ఆయన నెత్తికెత్తుకున్నారు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన్ని వంగవీటి రాధా ఈ మధ్యన కలిసి చర్చలు జరిపారు అని ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరు మధ్యన చర్చలు అంతా వైసీపీలోకి వంగవీటి రాధాను తీసుకురావడం కోసమే జరిగాయని అంటున్నారు. రాధా కూడా త్రిమూర్తులు చెబితే జగన్ వింటారు కాబట్టి తనకు మళ్ళీ అక్కడ చోటు దక్కుతుంది అనుకుంటున్నారుట.వంగవీటి రాధా జగన్ ని గతంలో నానా మాటలు అన్నారు. ఆయన ఓటమిని గట్టిగా కోరుకున్నారు. మరి జగన్ రాధా రాకను ఆహ్వానిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే వచ్చే ఎన్నికలు కీలకం కాబట్టి జగన్ ఎవరు వచ్చినా కాదనరు అంటున్నారు. అంతే కాదు, ఎంత కాదనుకున్న రంగా వారసుడిగా వంగవీటి రాధాకు ఇమేజ్ ఉంది. దాంతో పాటు కాపుల ఓట్లు కూడా వైసీపీకి కావాలి. దాంతో జగన్ వంగవీటి రాధాను తిరిగి పార్టీలో చేర్చుకుంటారు అన్న మాట ఉంది. అదే జరిగితే విజయవాడ రాజకీయాలు కొత్త మలుపు తీసుకోవడం ఖాయం. అదే విధంగా వైసీపీలో కూడా సమీకరణలు మారుతాయని అంటున్నారు.